పుట:Andrulasangikach025988mbp.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎరుకపాళెగాడు:-

అంపపొదికి నెమిలిపురిచుట్టి, సెలసు అను కట్టెతోచేసిన విల్లును బూని, మొలకు పులితోలుచుట్టి, నడుముదట్టీతో కురుచవిడెము దోపి, పికిలపూలదండలు వేసుకొని, కుడిచేతిసందిపై గొరిగింజల దండ చుట్టి "జుంజురు సికమీద జుట్టిన తలముళ్ళు దట్టిలోపల నఱ పెట్టుచుట్టు" కోర మీసలు, మిడిగ్రుడ్లు, వలుద ఓరచ్చులు కలిగి, నట్టివాడు.[1] (తలముళ్ళు అన చోర సాధనము, వేటసాధనము అన్నారు. నిఘంటుకారులు. ఇదివరలో ఈ పదము రెండుమారులు వచ్చెను. అఱ పెట్టుచుట్టు అంటే ఏమిటో నిఘంటువులలో లేదు. ఓరచ్చులనగా అట్టల చెప్పులు.

వేట వేషం:-

రాజులు వేటకు వెళ్ళినప్పుడు ధరించు విధాన మిట్లుండెను. "పట్టుచల్లడము దరించి, దట్టి గట్టి, "సరిగెక్రొంబని కందుసాలెయంగియ బూని". చలువ చెంగావి పచ్చడముకప్పి, పచ్చల పోగులు వహించి, కస్తూరీతిలకము తీర్చి, కుడివంక బాకు నుంచుకొని, మెడలో కెంపుల హారము వేసుకొని డాలుపట్టి, తళుకువన్నెకుళాయి నెత్తినబెట్టి బయలుదేరుతూ వుండిరి.[2] కందుసాలె అననేమో ? వేపుడు పనిచేయుశాల అని సూ.రా. నిఘంటువులో వ్రాసినారు' ఇక్కడ ఆ యర్థము సరిపోదు. ఒక విధమగు సాలెజాతివారు నేసిన జలతారు అంచుగల అంగీయని యర్థము చెప్పవలసి యుండును.

కోమటిసెట్టి వేషం:-

          "గందపుబొట్టు, వీడియము, కచ్చల పాగయు, కావిదుప్పటిన్,
           సందులపూసలున్, చెవుల చాటున నీలపుదంటపోగులున్,
           కండినయట్టి వెండిమొల కట్టును, నీలపుటుంగరంబులున్,
           బొందవు కిర్రుచెప్పులును, బొల్పెసగన్ దనవత్తు డెంతయున్."[3]

  1. చంద్రభాను. 2. 2. (తలముడి బహువచనం తలముళ్ళు. నల్లని నీలిబట్టను తలకు గుర్తుపడకుండా చుట్టిరని అర్థముచేసుకొనవచ్చును.)
  2. చంద్రభాను. 2-15.
  3. మల్హణ; ఆ. 2. పుట. 45.