పుట:Andrulasangikach025988mbp.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          ప్రీతో నిర్మితవాన్ చిత్రం గోండలీవిధి మత్యయం
          యతో భిల్లీ మహారాష్ట్రే గోడిగీత్యభిధీయతే."[1]

దీనినిబట్టి గోండు లను అటవికుల నృత్యము దేశమందు వ్యాపించెననియు దానికి గోండినీ అని పేరై క్రమముగా గొండిలి, గొండ్లి యయ్యెనన వచ్చును.

దేవాలయములందు, రాజసభలయందు బోగమువారు నృత్యముచేసి రనుటకు "హరి కొల్వునన్ వివిధలాస్యస్పర్థి సుభ్రూభ్రుకుంసుల వాదుల్ సరిదేర్చి పుచ్చి" అని రాయలు వ్రాసినదే ప్రమాణము.[2] భ్రుకుంసులు అన స్త్రీ వేషములు వేయు పురుషులు. నాట్యపు పోటీలు కూడా జరిగెననియు నిపుణులు ఉత్తమ మధ్యమాది నృత్యములను నిర్ణయించి రనియు పై యుదాహరణము తెలుపుతున్నది. మృదంగాదివాద్యములలో కొన్నింటిని రాయ లిట్లు తెలిపినారు. "మృదంగం బుపాంగంబావజంబు దండెతాళం బురుమ కిన్నెర సన్నగాళె వీణె ముఖవీష వాసె గ్రోలుడోలు మౌని భేరి గౌరు గుమ్మెట తమ్మెటంబు డుక్కి డక్కి చక్కి చుయ్యంకి లోనగు నసంఖ్యాత వాదిత్రత్రితయపరంపరలు మొరసె" అని తేలును.[3]

విజయనగర కాల మందలి తెనుగు కవిత ప్రబంధయుగముగా పేర్కొనబడినది. మహాకవు లీ కాలమందు వెలసిరి. కవిసార్వభౌములు, ఆంధ్రకవితా పితామహులు, సాహిత్యరసపోషణ సంవిధాన చక్రవర్తులు, ఈ కాలమందే వెలసిరి. రాజులు కత్తి త్రిప్పిన వడితోనే గంటము త్రిప్పిరి. స్త్రీలుకూడా సంస్కృతాంధ్రములందు సుందరకవిత లల్లిరి. గంగాదేవి, తిరుమలాంబ రామభద్రాంబ మున్నగు స్త్రీలు ప్రసిద్ధ కవయిత్రులు. గోలకొండ మలకలచేతను జిలిబిలి తెలుగు పలుకులను పలికించిరి. ఇబ్రహీం ఇభరాముడయ్యెను. ఈవిధముగా కళ లానాడు సర్వతోముఖముగా వర్ధిల్లి దేశి విదేశీజనులను ముగ్ధు లగునట్లు చేసెను.

  1. శ్రీ మానవల్లి ..... 188.
  2. ఆముక్తమాల్యద, 4-36.
  3. అము. 4-35