పుట:Andrulasangikach025988mbp.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గౌరవము తగ్గుటకు మారుగా హెచ్చినదనియు గొప్పగొప్ప అధికారులు వారి నుంపుడుగత్తెలుగా బాహాటముగా నుంచుకొనిరనియు పీస్ ఆశ్చర్యపడి వ్రాసెను. బోగము స్త్రీలకు రాజభవనాలలో నిరాఘాట ప్రవేశ ముండెను. హజార రామాలయములో నానాభూషణములలో ముస్తూ వున్న సానులను స్తంభాలపై తీర్చినారు. వాటిని జూడగా పలువురు బిర్రులాగులను దొడిగి వాటిపై లంగాలు కట్టినారు. దేవీ నవరాత్రులలో ప్రతిదినము ప్రొద్దున భువన విజయములోను, రథోత్సవము లన్నింటిని, దేవాలయములలో ప్రతి శనివారమున్నూ, వారు నృత్యము చేయవలసినవారై యుండిరి. నవరాత్రులందు మధ్యాహ్నము భోగపుసానుల కుస్తీకూడా జరిగెడిది. (కుస్తీ కిచ్చిన ప్రాముఖ్యమును కూడా ఇది నిరూపించును.) దేవాలయములలో నాట్యమంటప ముండెడిది. అందు సానులు నృత్యము నేర్పెడివారు. వారికి నృత్యము నేర్పించు గురువునకు కొన్ని యినాములు రాయలవా రిచ్చిరి. సంస్కృతములోను, కన్నడములోను సంగీత శాస్త్రములు వెలువడెను.

కూచిపూడివారి భరతాభినయముల ప్రఖ్యాతి యీ కాలములో నుండెను. మాచుపల్లి కైపియత్తులో ఇట్లు వ్రాసినారు. "సంబెట గురువరాజు ప్రభుత్వములో ప్రజలకు అతి దారుణశిక్ష చేస్తూ వుండేవాడు. ప్రజలు సొమ్ము త్వరగా ఇయ్యకపోతే స్త్రీలను తీసుకవచ్చి స్తనాలకు చిరుతలు పట్టించేవాడు. ఆలాంటి దినాలలో వినుకొండ, బెల్లంకొండ తట్టునుంచి వచ్చిన కూచిపూడివారు అదిచూచి అక్కడనుండి లేచిపోయి విద్యానగరము పోయి అక్కడ వీరనరసింహరాయలు రాజ్య పరిపాలనం చేస్తూవుండగా భాగవతులు దర్శనం అయి కేళి అడుగగా సెలవు ఇచ్చినారు. అక్కడ కీర్తన వినికి చేసే అప్పుడు ఒకడు సంబెట గురువరాజు వేషం వేసుకొని, ఇద్దరు బంట్రోతుల వేషం వేసుకొని, ఒకడు స్త్రీవేషం వేసుకొని, సంబెట గురువరాజువలెనే ఆస్త్రీయొక్క స్తనాలకు చిరుతలు పట్టించి సొమ్ము యివ్వుమని తహశ్శీలు చేసినట్లు వినికిచేసినారు. ........రాయలు సంగతులు కనుక్కొని మరునాడు సైన్యం సిద్దంచేసి రాయలకుమారుడు అనిపించుకొన్న ఇసుమాలుఖానుడనే తురకను సర్దారుగా మొకర్రారుచేసి పంపెను. అతడు సంబెట గురువరాజుపై లడాయిచేసి గురువరాజును పట్టుకొని తలకోసి తీసుకొని పోయినాడు. కోటలో స్త్రీలు బాలుర అందరు దేహత్యాగం చేసినారు."