పుట:Andrulasangikach025988mbp.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రటుడు తనకావ్యాలంకారములో దీనిని పేర్కొనెను. బొడ్డుచర్ల తిమ్మన్న అనునతడు రాయలకాలములో నీ యాటయం దతినిపుణుడు. లోకల్ రికార్డులలో నీతిని గూర్చి యిట్లు వ్రాసినారు. "అతడు కవీశ్వరదిగ్దంతి అనిపించుకొని కృష్ణరాయలవారి యొద్దకు పోయి వారితో చదురంగం ఆడుతూవుండేవాడున్నూ, ఆట గెలిస్తే వెయ్యార్లుపందెంవేసి గెలుస్తూ వుండేవాడున్నూ: అప్పుడు కృష్ణదేవరాయలు చాలా సంతోషించి కొప్పోలుగ్రామం, సర్వాగ్రహారముగా దారపోసి యిచ్చెను." ఈ విషయాన్ని పురస్కరించుకొనియే ఒక చాటు విట్లు కలదు.

         "శతసంఖ్యులొక్కటైనను సతతము శ్రీ కృష్ణరాయ జగతీపతితో
          చతురంగమాడి గెలుచును ధృతిమంతుడు బొడ్డుచర్ల తిమ్మన భళిరే!"

ఆ కాలపు పిల్లలాటలను కవులు కొందరు వర్ణించినారు. కాని అందు మనకు తెలియనివే యెక్కువగా కలవు నిఘంటుకారులును మనకుండు సందేహాలతో 'బాలక్రీడావిశేషము' అని అర్థము వ్రాసి దాటుకొన్నారు. పింగళిసూరన యిట్లు వ్రాసెను.

         "దినముల్ గొన్ని చనంగ నంత కడు వర్థిన్ బొమ్మపెండ్లిండ్లు, గు
          జ్జెనగూళ్ళచ్చనగండ్లు, పింపిళులు కుచ్చీల్, గీరనగింజ, లో
          మనగుంటల్, కనుమూసిగంతనలు, కంబాలాట లోనైన ఖే
          లనముల్ మీరగ బోంట్లతో సలరె బాలారత్న మెల్లప్పుడున్" [1]

గుజ్జెనగూళ్ళు=(కూళ్ళు) పిల్లలు గురుగులలో వంటలు వండి వడ్డించినట్లు ఆడుకొను ఆట. పింపిళ్ళు అన పిల్లలు పెదవులతో ఘర్షణ ధ్వనులు చేస్తూ గొంతుకూర్చొని పాదాల నాడించి ఆడెడియాట. కుచ్చిళ్ళన గూడమణియని సూ. రా. నిఘంటువులో కలదు. అనగా మట్టిలో లేక ఇసుకలో బారెడు మూరెడు పొడవు కట్ట చేసి అందేదైన వస్తువును దాచిన దానిని రెండవవారు కనుగొనుట. గీరనగింజల కదేగతి పట్టినది. అచ్చనగండ్లలోవలె గులకరాళ్ళతో ఆడుయాటగా తారాశశాంక మందలి యీ పద్యభాగమునుబట్టి యూహింపవచ్చును.

  1. కళాపూర్ణోదయము. 6-202