పుట:Andrulasangikach025988mbp.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

      "అమరులు ద్రావుచో నమృతమందురు దీని అహి వ్రజంబజ
       స్రముగొని యానుచో నిది రసాయనమందురు, భూసురౌఘమా
       గమవిధి సోమపానమని గైకొని యానుదురెందు, చక్రయా
       గమునెడ 'వస్తువం' దురిది కౌశికులీసురపేర్మి వింతయే!"

"చని యనేకవిధ మాంసోపదంశకంబు లాస్వాదించుచు మనోహృద్యంబులగు మద్యంబులు" సేవించిరి. (9-127 నుండి 132 వరకు) సంస్కృత భారతమందు దక్షిణదేశమును గూర్చిన చర్చ లంతగా కానరావు. నన్నయభట్టు మూలములో లేకున్నను అర్జునుని తీర్థయాత్రలో వేగి దేశమును, గోదావరిని కలిపి ఇట్లు వర్ణించెను.

      దక్షిణగంగ నాదద్దయు నొప్పిన
      గోదావరియుజగదాదియైన
      భీమేశ్వరంబును బెడగగుచున్న శ్రీ
      పర్వతంబును జూచి యుర్విలోన
      ఆనఘమై శిష్టాగ్రహార భూయిష్ఠమై
      ధరణీసురోత్త మాధ్వరవిధాన
      పుణ్యసమృద్ధమై పొలుచు వేగీదేశ
      విభవంబు చూచుచు విభుడు......
      .... ..... .... కృతార్థుడగుచు॥
  
                                   --- ఆది. 8-139

నన్నయకాలములో తెనుగుసీమలో భీమేశ్వరము, శ్రీపర్వతము, ప్రసిద్ధ తీర్థస్థలములై యుండెను. వేగీదేశమందు అగ్రహారము లెక్కువగానుండెను.

నన్నయకాలమందలి తెనుగుభాషా స్థితినిగూర్చి అనేక చర్చలు జరిగినవి. అవి యిచ్చట అప్రస్తుతమగుటచే సూచనమాత్రము చేయనైనది. నన్నెచోడుడు జాను తెనుంగును గురించి తెలిపినాడు. "సరళముగాగ భావములు జాను తెనుంగున" (కుమా. 1-35) దీనినే అతడు "వస్తుకవిత" అనెను. కన్నడములో "జాణ్‌నుడి"అని యంతకుముందే వాడిరి. దానినే ఇతడు ప్రచారము చేసినట్లున్నది. (చూడుడు. శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారి పీఠిక