పుట:Andrulasangikach025988mbp.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయితే, యిట్లందరును చేసిరని కాదు. కొందరైనను చేసిరని యర్థము. విద్వాంసులు వివిధ విద్యలను నేర్చిరి. అందు ముఖ్యమైనవి షడంగములు. నాల్గువేదాలు, మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము అను 14 శాస్త్రాలు. తర్కశాస్త్రము ఖండకారికా పుస్తకములు అనగా స్మార్తకర్మ ప్రయోగాలు కల శాస్త్రాలు, యజ్ఞ యాగాదుల మంత్రాలు, విశేషముగా బ్రాహ్మణ విద్యలై యుండెను.[1] బ్రాహ్మణులు సేద్యము చేయకుండిరి. చేసినను చాలా అరుదు. వారు అప్పుల పాలైనప్పుడు తమ మాన్యాలను కుదువ యుంచుతూ వుండిరి.[2]

రాజుల కొలువులో కవి పండిత సభలు జరిగేవి. లేదా విద్యా పీఠముల వద్ద జరిగెడివి. మధుర దక్షిణదేశ మందు ప్రసిద్ధమగు విద్యాపీఠమై యుండెను. కంచి, కాశి, కాశ్మీరము, తక్షశిల, నలందా, నవద్వీపము, అమరావతి వంటి స్థలాలలో విద్యాపీఠములు మరీ పూర్వకాలమందుండెను. విద్యార్థులు చదువు పూర్తిచేసుకొని స్నాతకులై గురువువద్ద సెలవుపొంది ఒక విద్యాపీఠమునకు వెళ్ళి అచట పండిత పరీక్షలో నెగ్గి జయపత్రమును (డిగ్రీ) పొంది పోయెడి వారు. రాజసభలలో విద్యాధికారు లుండెడివారు. అచ్చట కవులుకాని, పండితులుకాని, వాదములు చేసెడివారు. అందు గెలిచినవారికి బహుమతు లిచ్చెడివారు. ఓడిపోయిన పక్షమువారు తబ్బిబ్బై బయటకు వచ్చి తమ పాదరక్షలు మరచిపోయి తిరిగివచ్చి తీసుకొని తమ యెదుటనే ఉండు అందలాలు కానక ముందుకు పోయి వెదుకులాడి భ్రమనొంది రాజుపై నిందపెట్టి నానావస్థలు పడెడివారు.[3] కవి పండితుల సభ రాజుయొక్క భవన "చతుశ్శాలిక"లో జరిగెడిది.[4] వాదములందు గెలిచిన వారిని, మహాకవులను రాజులు పూజించిరి. వారికి టంకాలిచ్చిరి.

          "వాద మొనరించి గెలిచి, తత్వంబు దెలుపు
           వాని కని బీరపువ్వులబోని టంక
           సాల వాటులు నించి యాస్థాని గట్ట
           కాలసర్పముగతి వ్రేలు జాలె జూచి"[5]

  1. ఆముక్త మాల్యద 7 - 3.
  2. మనుచరిత్ర 3 - 129
  3. ఆముక్త మాల్యద, 4 - 7.
  4. ఆముక్త మాల్యద 4 - 4.
  5. ఆముక్త మాల్యద. 2 - 58.