పుట:Andrulasangikach025988mbp.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         చెవుల పూవులు బవిరలు చేరుచుక్క
            కొప్పువలయును సవరించి రొప్పుమీర
         భూషణములకు తానొక భూషణమయి
            పడతి యపుడొప్పె కన్నులపండువగుచు"[1]

అప్పుడు ముక్కర సర్వసాధారణముగా నాభరణము.[2] నేటికిని రాయలసీమ, దాని పరిసర తెలంగాణా ప్రాంతములో శూద్ర స్త్రీలు ముక్కర పెట్టుకొంటున్నారు. వనితలు కొప్పులలో తురుగుడు బిళ్ళలు, కంఠములలో ముత్యాల హారాలు, నడుములందు డావులు, కాళ్ళలో పాంజీలు ధరించిరి.[3] బోగపుసానులు ఎర్రని పావడలను కట్టుకొనిరి.[4]

తంబలజాతి వారు దేవాలయ సత్రబోజనములకు గాను విస్తర్లను కుట్టుకొని తెచ్చియిచ్చువారై యుండిరి.[5] తంబలలు (తంబలి) వారు రాయల సీమలో శుభకార్యాలలో పూలు, తములపాకులు తెచ్చి యిచ్చువారు. మరియు పూర్వము శివాలయములందు పూజారులై యుండిరి. నేటికిని అట్టి యర్చకులు కొందరు మిగిలియున్నారు. మరికొన్ని తావులలో వారు దేవాలయములందును, శుభకార్యములందును డోలు వాయింతురు. వీటినిబట్టి వారికొక నియమిత వృత్తికలదని చెప్పజాలము. తాంబూలి శబ్దభవమే తంబలి (తంబల) అయియుండునో యేమో ?

అన్ని వర్ణముల పురుషులు నడుములలో ఎర్రని పట్టీని 6, 7 మూరల దానిని చుట్టుకొంటూ వుండిరి,[6] కాసె కట్టు, కాసెదట్టి, దట్టి అనిరి. అయితే ఎరుపే ప్రధానము కాదు. కొందరు నల్ల కాసెలు కట్టిరి.[7]

  1. కళాపూర్ణోదయము 7 - 69.
  2. ఆముక్తమాల్యద. 4 - 161.
  3. మనుచరిత్ర 6 - 5.
  4. మనుచరిత్ర 6 - 81
  5. Salatore, II.
  6. ఆముక్తమాల్యద. 4 - 187, 1 - 17.
  7. ఆముక్తమాల్యద. 7 - 16.