పుట:Andrulasangikach025988mbp.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          "గట్టిగా పెంప దక్షత లేమి నూరూర
           బందెల బడిపోయె పశుగణంబు"[1]

        అనుటచే బందెలదొడ్ల పద్ధతి దేశమంతటనూ నుండెను.

రెడ్డివేష మెట్టిదో యిట్లొక కవి వర్ణించెను.

          "బసపు చుంగుల తలపాగ నెట్టంబు
               కసిబిసి మెనగు బాగాల వీడియము
           మిన్నదేరెడు దొడ్డమెడ నూలు మిగుల
               సన్నియగల మాధవళి పచ్చడంబు
           దళసరియగు దేవదారు గంధంబు
               వల కేల గనుపట్టు వంకుటుంగరము
           డొల్లు బోగులును కాటుకపప్పు దేరు
               పిల్లిగడ్డము, పడిబెట్టు మీసలును
           నలవడ నాందోళికారూడు డగుచు
               అలనాటి పూర్వికుడగు పెద్దిరెడ్డి"[2]

(నెట్టముకాదు నెట్టెము=అనగా గుంపురుమాల. మాదళము, మాదావళము అన్న రూపాలు కలవు. అనగా కపిలవర్ణము కలది. వంకుటుంగరమన వంకి వంటి వంకర యుంగరమని యర్థమేమో! పెద్ది రెడి కాక పెద్దిరెడ్డియేమో!)

ఈకవి కాపువానిని వేరుగా వర్ణించినాడు. రెడ్లుకూడ కాపులే. కాని ఇతర జాతులవారు పలువురు కాపులని చెప్పుకొనిరి. ఇక్కడ వ్యవసాయకుడగు నొక శూద్రజాతి వారిని యభిప్రాయ ముండును.

          "అప్పు డామడిసేయు నాయూరికాపు
               ముప్పిరిగొను పగ్గముల చుట్టుతోడ
           గుచ్చిన మునికోల గొంగడిముసుగు
               మచ్చల మచ్చల మట్టికాశియును

  1. మనుచరిత్ర 129
  2. ద్విపద పరమయోగి విలాసము, పు 478