పుట:Andrulasangikach025988mbp.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారు. కడపలోని ఒక తాలూకాలో 3574 చదురపుమైళ్ళ వైశాల్యములో 4194 చెరువులున్నవి"[1]. విజయనగర చక్రవర్తులు సమృద్ధిగా చెరువులు కట్టించి రైతుల నాకర్షించి దేశమును సుబిక్షముగా చేసిరి. రాయల రాజనీతియు నట్టిదే.

         "దేశ సౌబాగ్య మర్ధసిద్ధికిని మూల
             మిల యొకింతైన కుంట కాల్వలు రచించి
          నయము పేదకు, అరి, కోరునను నొ
             సంగి ప్రబలజేసిన ఆర్థధర్మములు పెరుగు"[2]

చిన్న భూప్రదేశములందు సహితము చెరువులు, కుంటలు, కాలువలు త్రవ్వించి రైతులకు తక్కువ పన్నులపై భూములిచ్చి తక్కువ కోరువారినుండి తీసుకొనిన వారు వృద్ధికి వత్తురు. ప్రభుత్వకోశము నిండును. రాజు ధర్మపరుడను కీర్తియు వచ్చును అని రాయలు వ్రాసెను. నూనిజ్ అను సమకాలికు డిట్లు వ్రాసెను. "నాగులాపురము (హోసపేట)లో రాయలు చాలా గొప్ప చెరువును కట్టించెను. ఆ చెరువు నీటితో వరిమళ్ళు చేసి తోటలు సమృద్ధిగా పెంచిరి. రైతుల నాకర్షించుటకై రాయలు ఆ చెరువు క్రింది భూములపై మొదటి తొమ్మిదేండ్లు పన్నును తీసుకొనలేదు. అటుపై వచ్చిన 20 వేల మాడల పన్నుతో అతని మండలేశ్వరుడగు కొండమరాజు ఉదయగిరిలో అనంత సాగరమును కాలువాయి చెరువును కట్టించెను.[3]

రాయలవారు స్వయముగా వ్యవసాయకుల కనుకూలములు కల్పించినను పలువురు మండలాధికారులు పన్నులెక్కువగా లాగి, బాధించిరి. అందుచేత పలుమారులు పన్నులు తక్కువగానుండు ప్రాంతాలకు రైతులు వెళ్ళిపోయిరి. ఉత్తరఆర్కాటు జిల్లాలో 33 పన్నులలో 32 పన్నులను దేవస్థానమువారు తీసుకొనిరి. ఒక పన్నునే కేంద్ర ప్రభుత్వము తీసుకొనెను. దేవాదాయ బ్రహ్మదాయ భూములనుండి వసూలుచేయు పన్నులను రాయలు తీసివేసిరి. చిదంబరములో పన్నులెక్కువని ప్రజలు మొరపెట్టుకొనగా అక్కడి మండలాధికారి వాటిని తగ్గించెను. మరొక తావున ప్రజలు గుంపులుగా వెళ్ళి రాయలతో మొర వెట్టుకొన వారు పన్నులను తగ్గించిరి.[4]

  1. V. S. C. P. 216.
  2. ఆముక్తమాల్యద. 4 - 236.
  3. V. S. C. P. 217, 228.
  4. V. S. C. P. 217, 228.