పుట:Andrulasangikach025988mbp.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొంగలనుండి చేలకు కావలి గాసెడివారు. వారి స్త్రీలు ముసురుపట్టిన వర్షాకాలములో అంబలి పాత్రను బుట్టలోపెట్టి నెత్తిమీద పెట్టుకొని దానిపై జమ్ముగూడ వేసుకొని కావలిగానున్న తమపురుషుల కిచ్చెడివారు. జొన్న సజ్జ గోధుమ పిసికిళ్ళు' కావలి కాయువారికి సమృద్ధిగా నుండెను. వర్షాకాలములో రెడ్ల బ్రదుకు' నిటు రాయలవారు వర్ణించినారు.

        "గురుగుం, జెంచలి, తుమ్మి, లేకగిరిసాకుం, తింత్రిణీపల్లవో
         త్కరమున్, గూడ పొరంటినూనియలతో కట్టావికుట్టారుగో
         గిరముల్ మెక్కి తమింబసుల్ పొలము వో గ్రేవుల్ మెయిన్నాక, మే
         కెరువుం గుంపటి మంచ మెక్కిరి ప్రభుత్వైకాప్తి రెడ్లజ్జడిన్.[1]

శ్రావణమాసములో ఆకుగూరలు సమృద్ధి, అప్పుడు గురగు (గునుగు అని వ్యవహారం). చెంచలి, తుమ్మి, లేత తగిరిసాకు (తగిరెంత అని వ్యవహారం). ఈ నాలుగు కూరలను తరిగి చింతచిగురు కలిపి బాగా నూనెపోసి పొడికూరగా చేసి కావలసిన ఉప్పు కారము మున్నగునవి చేర్చి కలగూర చేసిరన్నమాట. వారికి పశువుల సమృద్ధియు, గొర్లమందలి సమృద్ధియు, వరిమళ్లును, మంచాలపై పడకలును కలవని ఈ పద్యమందు సూచితములు.

సామాన్య రెడ్ల భోజనమును కృష్ణరాయలు వర్ణింపగా ఆతనికి 100 ఏండ్ల తర్వాత నుండిన తంజావూరి రఘునాథ రాయలు రెడ్డి దొరల భోజనము నిట్లు వర్ణించెను.

        "కప్పుర భోగివంటకము, కమ్మగనే, వడియున్, భుజించి, మేల్
         దుప్పటు లట్లు మూరగల తోరపు బచ్చటముల్ చెలంగగా
         గొప్పక దానిపైడి జిగి గుత్తపు టుంగరముల్ కరంబులన్
         ద్రిప్పుచు రచ్చచేయుదురు రెడిదొరల్ తమి హెచ్చ నచ్చటన్."

-రఘునాథ రామాయణము.

రెడ్లు గ్రామాధికారులై యుండిరి. దొంగలను పట్టుట, శిక్షించుట, తగవులు తీర్పులు చెప్పుట, గ్రామరక్షణము సేయుట వారి విధులై యుండెను.[2]

  1. ఆముక్తమాల్యద. 4 - 134.
  2. ఆముక్తమాల్యద 7 - 19