పుట:Andrulasangikach025988mbp.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొరల యిండ్ల మంచాలు చిలుకలతోను, హంసలతోను, సన్నని పనితోను కూడినట్టి "నసకినెల పట్టెమంచములు", వాటికి దోమ తెర లుండెను. వారి యిండ్లవద్ద 'నకీబులు' వేత్ర హస్తులు ప్రహరి (పహిరా) యిచ్చెడివారు. (నకీబు ఫార్సీ నభీబ్ పదమే. దానికి సర్దార్ అని యర్థము. అనగా భటుల సర్దారులు) రాచవారు తమ గ్రామములకు వచ్చినప్పుడు వారిని పెండ్లి కొడుకులవలె పగటి దివిటీలతో, వాద్యములతో ఎదుర్కొని తీసుకొని పోయెడివారు.

విజయనగర చక్రవర్తులు సామ్రాజ్యవ్యయము లన్నియు, సొంత వ్యయము లన్నియు పోగా ఏటేట ఒక కోటి మాడలు మిగిలించుకొంటూ వుండిరి. వారి మంత్రులు, సామంత మండలాధీశులు జీతమునకు మారుగా పొందిన జాగీర్ల నుండి ఒక్కొక్కరు ఏటేట 15,000 నుండి 10 లక్షల మాడల (ఆర్ధవరహా) ఆదాయం పొందుతుండిరి. అందు వారు మూడవ భాగము చక్రవర్తి కిచ్చి తక్కిన భాగముతో నియమిత సైన్యము నుంచుకొని, ఆజ్ఞాపించినపుడు దానితో యుద్ధసహాయార్థము వెళ్లవలసి యుండెను. కాని వారు నియమిత సైన్యమును నిలువ యుంచక గ్రామాలలోని జనులను కొందరిని అవసరమగునప్పుడు వచ్చుటకు కట్టడి చేసుకొని ఆదాయమును పెంచుకొని, ఇచ్చవచ్చినట్లు వ్యయము చేసి ఆనందించెడివారు.[1]

విజయనగర రాజధాని యావరణము ఇంచుమించు 60 మైళ్లుండెను. చక్రవర్తి ప్రాసాదము మహాభవనముతో నిండినది. అందు పెద్ద పడసాలలు, మోసాల లుండెడివి. లోపల విశాలతగల బయళ్లుండెడివి. ఎక్కడ బట్టినా నీటికొలను లుండెడివి. నగరములోని మండాలాధీశ్వరులు, మంత్రులు కూడా అదే విధానముపై తమ భవనాలు కట్టుకొని యుండిరి. చక్రవర్తి ప్రాసాద సమీపముననే సామంత ప్రభుల భవనాలుండెడివి. అవి బారులు తీర్చిన వీధులుగా నేర్పాటై యుండెను. అవి చాలా యందమై అలంకృతమై శిల్పములతోను, చిత్తరువులతోను నిండినవై కన్నుల పండువై యుండెను. విరూపాక్ష స్వామ్యాలయము ముందు అతివిశాలమగు వీధియు చక్కని వరుసలో నుండిన మహా భవనములను చూచి యానందింప దగినవై యుండెను. నాగులాపురము (హోసపేట)లోని యిండ్లు ఒంటిమిద్దెలై, విశాలమైనవై యుండెను.[2]

  1. V. S. C. P. 226.
  2. V. S. C. P. 226.