పుట:Andrulasangikach025988mbp.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారి ప్రజలైన దొంగలు వానిని చెనకరు" (వేదంవారి వ్యాఖ్య). అటవికులను స్నేహితులనుగా చేసుకొనకుండిన వారు ప్రజలను బాధించెడివారు. "పార్వతీయ బలంబులోనం గూడకయు రాజునకు ప్రజాబాధ తరుగదు. ఎట్లేని బెదరు వాపి, వారలం జేకూర్చుకొనవలయును. అవిశ్వాసంబును, విశ్వాసంబును, అలుకయు నెలమియు, అతి వైరంబును అత్యనుకూలంబును, అల్పు లగుట నల్పంబునుయగు. ఎట్లంటేని" (ఆము. 4 - 222) "చెంచులులోనగు వారు పాలన్నము పెట్టిన మాత్రాననే అ పెట్టినవారియెడ సత్యము తప్పక ప్రవర్తింతురు. అయినను ఏ యించుక అతిక్రమము కనబడినను పగబట్టుదురు." (వేదం వ్యాఖ్య. ఆము. 4 - 223)

మన సారస్వతములో వేట ముచ్చట వచ్చినప్పు డాటవికులు రాజువద్దకు వచ్చి పునుగు పిల్లుల, దుప్పికొమ్ముల, ఏనుగు దంతముల, పులిగోర్ల, జింక చర్మాల, చారపప్పు, ముంతమామిడి, తేనె మున్నగు వాటిని తెచ్చి కానుక యిచ్చినట్లు వర్ణించిరి. అంతకంటె మించి వారేమియు తెలుపలేదు. మన ప్రక్కననే అనాదిగా జీవించి మన భాషనే నానాపభ్రంశ రూపాలతో మాట్లాడు గోండ్లు, కోయ, చెంచు, సవర మున్నగు నాటవికులను సంస్కరించుట, వారి జీవన విధానములను బాగా గమనించి, వారి చరిత్రలను వ్రాయుట అనునది మనలో నేటికిని లేదు. పాశ్చాత్యులు వారిని గురించి అనేక గ్రంథాలు వ్రాసిరి. ఇటీవలెనే హ్యుమన్‌డ్రాఫ్ అను జర్మనువాడు హైదరాబాదులో ఆటవికోద్యోగియై చెంచులను గూర్చి, బిసన్ కొండలోని (గోదావరీ తీరారణ్యము లందలి) రెడ్డి అను అటవికులను గూర్చి (Reddies of the Bison Hill) సమగ్రోద్గ్రంథములను వ్రాసెను. వాటిని చూచువారు కూడా మనలో లేరు. అయితే ఆ జర్మనుకు తెనుగు రానందున చెంచుల తెనుగును అర్థము చేసికొనలేక చాలా తావుల పొరపాట్లు చేసినాడు. చెంచులను గురించి తెనుగువారే వ్రాయుటకు ఉత్తమాదికారులు. మన చెంచుల ఆటలు, పాటలు, భాషలోని విశేషాలు, ఆచారాలు, విశ్వాసాలు, దేవరలు, వారిబట్టలు, రూపములు, పరిశ్రమలు వారి ఓషదీ విజ్ఞానము, వారి మంత్రతంత్రాలు, వారి ధనుర్విద్యా పాటవము, వారి గుడిసెలు, ఆహారము మున్నగు ననంత విషయాలను గూర్చి కొందరు యువకులు ప్రత్యేక కృషిచేయుట యుక్తము.