పుట:Andrulasangikach025988mbp.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేటకుక్కలలో బయలుదేరి జింకల జోపుతూ వాటికాళ్లు బురదలో దిగబడి యురకలేక అలసిపోయినప్పుడు వాటిని కుక్కల సహాయముతో పట్టుకొంటూ వుండిరి.[1] పెద్దన యీ వేట హిమాలయములలో చేసినట్లు వర్ణించెను. హిమాలయ పర్వతాలపయిన రేగడిపన్ను కలదా? రేగడి సీమయగు కర్నూలు, కడప, బళ్ళారి జిల్లాలలో నేటికిని జనులు వర్షాకాలములో జింకలవేట నాడుదురు. కర్నూలు, కడప మండలాలలో నుండు ఎర్రమల నల్లమలలలోని చెంచుల జీవనమును, వారి వేటను ధూర్జటికవి యిట్లు వర్ణించినాడు.

పొత్తపినాడు అనున దిప్పటి కడపజిల్లాలలోని రాజంపేట తాలూకా లోనిది. ఉడుమూరు అనున దిప్పటి ఉడుములపాడు. అచ్చట చెంచులుండిరి. వారు పారుటాకుల కటిసీమల కట్టిరి. అవే వారి యుడుపులు. నేటికిని కోయలు మున్నగువారు స్త్రీ పురుషులును ప్రతిదినము ఆడ్డాకులను పెద్ద ఆకులను ముందొకటి వెను కొకటి వేసి మొలకు కట్టుకొందురు. చెంచు స్త్రీలకు కురువిందదండ లిష్టము. పైరులకు దృష్టిదోషము పోవుటకై పసరముల తలలను, ఏనుగుల తలలను కొమ్ములతో చేలలో నెత్తెడివారు. వారు అడవిలోని పండ్లను, గడ్డలను, తేనెను, చారపప్పు మున్నగువానిని తినెడివారు. వారి స్త్రీలు ఎరుపుగల వెంట్రుకలతో నెమలి పింఛాలు పెట్టి, అలంకరించుకొనెడివారు. చెంచులకు విల్లంబులు ప్రధానమగు ఆయుధాలు, వారు బాణాలతో అడవి జంతువులను వేటాడి వాటి మాంసమును తినెడి వారు, నేరేడు, నెలయూటి, కొండమామిడి, దొండ, పాల, నెమ్మి, బరివంక, చిటిముటి, కలివె, తొడివెంద, తుమికి, జాన, గంగరేను, వెలగ, మోవి, బలుసు, బీర, కొమ్మి, గొంజి, మేడి మొదలగు పండ్లను తినెడివారు.[2]

అడవిలోని చెంచు, కోయ, భిల్లులు నామకార్థముగా తమచుట్టు రాజ్యాలకు లోబడినవారయినను వా రించుమించు స్వతంత్రులే. "అభీర భిల్లాది కంపకోలనూల నాజ్ఞ చెల్లు"[3], "వారెవ్వరికైన అభయ మిచ్చినచో వానిచేతికి ఒక యంపకట్టెను (బాణము) గాని, నూలిపోగునుగాని గుర్తుగానిత్తురు, దానిం గని

  1. మను ... 4 - 20.
  2. శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము 3వ ఆశ్వాసము. 1 నుండి 130 వర కుండు పద్యాలన్నియు చూడవలెను.
  3. ఆముక్తమాల్యద 4 - 206.