పుట:Andrulasangikach025988mbp.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హురుముజ్ జలసంధిలోని రేవుల నుండి ఓడలు వచ్చి పోయెను(Gulf of Hurmuz). అక్కడి ముత్యాలు చాలా శ్రేష్ఠమైనవై యుండెను. అందుచేత వాటిని హురు ముంజి ముత్యాలనిరి.

తూర్పున నుండి బర్మా, మలయా, ఇండోనీషియా, చీనా దేశాలతో వ్యాపారము జరిగెను. విజయనగర సామ్రాజ్యము తూర్పున కటకము నుండి రామేశ్వరము వరకును, పడమట గోవానుండీ కన్యాకుమారి వరకును వ్యాపించి యుండెను. పడమట గోవాలో కాలికట్టు రేవులో ఎక్కువ వ్యాపారము జరిగెను.

"కాలికట్టువంటి మంచి రేవులు సామ్రాజ్యమందు 300 వర కుండెను" అని అబ్దుర్రజాఖ్ వ్రాసెను. "రత్నాలు, ముత్యాలు, ఆభరణాలు, గుర్రాలు, ఏనుగులు, పట్టు, నూలుబట్టలు, సుగంధ ద్రవ్యములు, ఓషధులు, ఇనుము, వెండి, విశేషముగా వ్యాపార వస్తువులై యుండెను. వ్యాపారములో సంపూర్ణ న్యాయము ప్రసాదింపబడుచుండెను. అందుచేత పోర్చుగీసువారును, అరబ్బులును ఎక్కువగా వచ్చిరి."[1] అని బార్బోసా వ్రాసెను,

వ్యాపారమును గూర్చి శ్రీకృష్ణదేవరాయలే తన ఆముక్తమాల్యదలో నిట్లు వ్రాసెను.

         "రేవుల్మావు మతంగజంబును మణి శ్రీఖండ ముక్తాదియున్
          రా, వాణిజ్యము పెంచి యేలగ నగున్ వర్షంపుటెవ్వన్ రుజన్
          హాళ్ళన్ దిగు నన్యభూప్రజల రా జాయాయి జాత్యౌచితిన్
          బ్రోవంగాదగు, తోటదొడ్డిగను లాపుల్ సూడ బంపందగున్"[2]

పరదేశములనుండి గుర్రములు, ఏనుగులు, రత్నాలు, చందనము, ముత్తెములు, రేవులద్వారా వచ్చెననియు, వాటిని తెచ్చు విదేశీ వ్యాపారులకు సౌకర్యములు కూర్చిరనియు, క్షామాద్యుపద్రవముల వలన పరదేశి జనులు వచ్చిన వారి నాదరించిరనియు పై పద్యము సూచించినది.

  1. V. S. C. P. 36.
  2. ఆముక్తమాల్యద 4 - 245