పుట:Andrulasangikach025988mbp.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"కన్నడములో ప్రతాపము అన్న నాణెమును తెనుగు మాడ అన్నట్లున్నది. అది రెండు రూపాయల లోపలి విలువకలది. చిన్నమను నాణెము వరహాలో ఎనిమిదవ భాగము అనగా ఏడణాల విలువది."

"హాగ అను కన్నడ నాణెమునే కాకిణీ అనిరి. అది పణములోని నాల్గవభాగము.

"తిరుమలరాయలు రామటంకలు అను నాణెములను జారీచేసెను.[1] శ్రీనాథుడు దేవరాయల ఆస్థానమందేకదా దీనారటంకాల అభిషేకమును పొందినది! నాణెముల నిపుణు లెవ్వరును దీనారములనుగాని, టంక ములనుగాని పేర్కొనలేదు."

పై నాణెము లన్నింటిలో మాడలే తెనుగుదేశమం దెక్కువగా వ్యాప్తిలో నుండినని సారస్వతమందలి వర్ణనలనుబట్టి ఊహింపవచ్చును. జనులు మాడలను బిందెలలో నింపి ఇండ్లలో, దొడ్లలో, చేలలో గుర్తుగా దాచుకొంటూవుండిరి. తరాలుగా దాచిన జాడలు వృద్ధులు తమవారికి తెలుపకముందే చచ్చుటయు, దానికై వాని సంతతి వారు వెదకుటయు సంభవించెడిది. ధనాంజనము వేసి ధన మెక్కడున్నదో కనిపెట్టే మంత్ర తంత్రవేత్తలు బయలుదేరిరి. పలుమారు దాచిన ద్రవ్యము పరులకు హఠాత్తుగా దొరుకుతూ వుండెను. ద్రవ్యమును భూమిలో పూడ్చి దాచుకొను నాచారము నేటికికూడ మన పల్లెలలోని కొందరిలో కానవస్తున్నది. వరశుల్క కన్యాశుల్కములు మాళ్ళలోను, వరహాలలోను ఇస్తూ వుండిరి. వివాహాలలో బంధుమిత్రులు వరహాలను "చదివిస్తూ" వుండిరి. ఈనాడు జనులు రూపాయలు చదివించినను "అముకవ్యక్తి చదివించిన ఇన్ని వరహాలు" అని పురోహితుడు అందరు వినగా చదువుతూనే ఉంటాడు. విజయనగర టంకముద్ర అంతటి బలిష్ట మయినది.

నాణెములు మన ప్రాచీనుల చరిత్ర నిర్మాణమునకు చాలా సహాయపడును. పైగా ఆకాలపు లోహముల విలువను, టంకసాల పద్ధతులను, నాణెముల విలువలను ఆర్థిక వ్యవస్థను తెలుపునట్టివి. పాశ్చాత్యులు ప్రాచీన నాణెములకు విలువ నిత్తురు. వాటిని ప్రయత్న పూర్వకముగా సంపాదించి సేకరించి యుంతురు.

  1. పంచముఖ అనువారు వ్రాసిన వ్యాసము.