పుట:Andrulasangikach025988mbp.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          అరిమి తరిమిన భయమున విరిగి జరిగి
          నిజబలంబులడాకకు నిలువలేక
          శరణు జొచ్చినవారల కరుణ జూచి
          యచటి దుర్గస్థలంబుల నాక్రమించె[1]

తుపాకీలు యుద్ధములో ముఖ్యమైనవయ్యెను. రాయచూరులో బాణములు సిద్ధము చేసినట్లు కానవచ్చును. "రాచూరి బిరుదు తలాటము" అని నవనాథ చరిత్రలో (పుట. 36) వ్రాసిరి. దీన్నిబట్టి రాయచూరులో పూర్వము ఆయుధ పరిశ్రమ ప్రసిద్ధముగా నుండెననుట స్పష్టము. "కలనైన విరిగెరుంగని పోటు పరిక, రాచూరు కత్తులమాటు జొచ్చె కొన్ని" అని వేంకటనాథుడును పంచతంత్రములో వర్ణించెను. (4 - 249) కృష్ణరాయల సైన్యమును చూచి తురకలిట్లనుకొనిరట.

          ఏనుగులు వేయి, బొందిలీ లెంచిచూడ
               లక్ష, పెండారు లొకలక్ష, లక్ష తురక
          లిచటి బల మానృపాలున కెంచ భటులు
               నారులక్షలు, హరు లర్వదారువేలు,
          పరలు కరు లొక రెండువే లరసిచూడ
               రాజులును వెల్మలును కమ్మ ప్రజలు ఘనులు
          కలుగు రాయలతో పోరి గెలువ మనకు
               వశమెయైన ఖుదా యున్నవాడటంచు.[2]

యుద్ధములో నుపయోగించు ఆయుధాలను కొన్ని తెలిపినాము. అవికాక పెట్లగ్రోవులును, జబురుజంగులును, ఫిరంగులును, డమామీలును, బాణపుజివ్వలును, రాళ్ళును ప్రయోగించిరి.[3] దంచనములు అను ఆయుధములనుకూడా యుపయోగించిరి. అది ఫిరంగియని కొందరు, గొలుసుతోడి పాషాణయంత్రమని కొందరు వ్యాఖ్యానించిరి. ద్వంసనము అనుదాని తద్బవము దంచనమై యుండును.[4] సైన్యములకు ముందొక నాయకుడును, వెనుక నొక నాయకు

  1. కృ. రా. విజయము. 3 - 5.
  2. కృ. రా. విజయము. 3 - 26.
  3. కృ. రా. విజయము. 7 - 29.
  4. ఆముక్త మాల్యద 2 - 9.