పుట:Andrulasangikach025988mbp.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్రోసిరి. శత్రువుల బిరుసుతనమును జూచి రాజవాహనుడు "రేపు అర్వలగ్ణ" యని ప్రకటించెను. శత్రువు లది విని సంధి చేసుకొనిరి.

కంపరాయలు దక్షిణదిగ్విజయ యాత్రా వస్థానము చేసినప్పుడును పైన వివరించిన విధానమే కానవచ్చినది. "వీరకంపరాయలు ప్రొద్దుననే లేచి పృతనాధ్యక్షులను (సేనానులను) సేనాసన్నాహమునకై ఆదేశించెను. వారును రణ దుందుభులను కోణాభిఘట్టనలచే నగరమందు మ్రోయించి ప్రకటించిరి. ఏనుగులు గుర్రాలు వచ్చి చేరెను. కవచ ధారులగు భటులు కృపాణ కర్పణ ప్రాస కుంత కోదండపాణులై వచ్చికూడిరి. ప్రస్థానోచిత వేషములతో సామంతులు సేనానులు వచ్చిరి. ఉత్తుంగ ధ్వజముల నెత్తిరి. పురోహితులు యాత్రా ముహూర్తమును నిర్ణయించిరి. అధర్వ వేదమంత్రాలు తెలిసిన బ్రాహ్మణులు మంత్ర పూతమగు హోమము చేసిరి. తర్వాత తనకై తెచ్చిన యుత్తమాశ్వము నెక్కెను. సేనానులు జయవాదములు చేసిరి. సామంతులు రాజుముందు నడిచిరి. నగరస్త్రీలు లాజలు చల్లిరి. తర్వాత ప్రయాణము సాగించి అయిదారు దినాలలో చంపరాజు రాజధానియగు ముల్వాయిని చేరిరి. యుద్ధమందు చంపరా జోడి పారి, రాజగంభీర అను కోటలో దాగెను. కంపరాయ లాకోటను ముట్టడించి బాణములతో కోటలోని సైన్యాన్ని నష్టపరచెను. కోటనుండి యంత్రములచే రువ్వబడిన పెద్ద పెద్ద గుండ్లు కంపరాయల సైన్యమును నష్టపరచెను. తుదకు నిచ్చెనలతో కోటనెక్కి పట్టుకొనిరి.[1]

విజయనగర రాజులు లక్షలకొలది సైన్యమును కలిగియుండిరి. తళ్ళికోట యుద్ధములో రామరాజు ఆరులక్షల సైన్యములతో పోరాడెనని అంచనా వేసి యుండిరి. విజయనగర చక్రవర్తులు సైన్యముపై గుర్రములపై యెక్కువగా వ్యయము చేసిరి. బహమనీ రాజ్యము అయిదు చీలికలై అహమద్ నగరు, గోలకొండ, బిదర్, బిజాపూర్, బీరారులలో నెలకొని సర్వకాలము లందును ప్రక్కబల్లెమై ప్రమాద హేతువై యుండెను. ఏమాత్ర మవకాశము దొరకినను వారు సామ్రాజ్యమును ధ్వంసము చేయువారు. అందుచేత విజయనగర చక్రవర్తులు సైన్యముపై అత్యంత శ్రద్ధ వహించిన వారైరి. మొదట ఈరానీ వారును తర్వాత పోర్చుగీసువారును ఈ రాజులకు గుర్రాల నమ్మిరి. మంచి

  1. మధురా విజయం 4వ సర్గము.