పుట:Andrulasangikach025988mbp.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన గద్దెపై ఖురాను నుంచుకొని దానికిచేసిన తురక సలాములను తానును పంచుకొనెను. ఇట్టిలోపాలతో కూడిన సైన్యాలను విజయనగర చక్రవర్తులు వీలయినంతవరకు సవరించుకొంటూ వచ్చిరని నిరూపించినాము.

కాకమానిమూర్తి కవిచే రచితమయిన[1] రాజవాహన విజయము అను పద్యకావ్యమును చూడగలిగితిని. శ్రీ యన్. వేంకటరమణయ్యగారు వ్రాసిన యొక ఇంగ్లీషు వ్యాసమును జదివి తెనుగు మాలమును చూచితిని. రాజవాహన విజయములో తురకల తుపాకీ యుద్ధాలు వర్ణింపబడుట చేతను సదాశివరాయల టంకాలను పేర్కొనుటచేతను తత్కర్త క్రీ.శ. 1600-1650 ప్రాంతమందుండినవాడుగా కనబడుచున్నాడు. రాజవాహన విజయమందు యుద్ధయాత్రను గురించి విపులముగా వర్ణించినారు. విజయనగరరాజుల యుద్ధయాత్రలను సమకాలికులు కొందరు వర్ణించి దానికిని ఈ కవితలోని విషయములకును ఏమియు భేదము కానరానందున కటువైన యీ కవితనుండి మనకు పనికివచ్చువిషయముల నుదాహరింతును.

"రాజవాహన యువరాజు యుద్ధయాత్రను నగరమందు ప్రకటించెను. సైన్యమంతయు నగర బహి:ప్రదేశమందు కూడెను. యువరాజు జలతారు పనిగలిగి చక్కని కుట్టుపని కలిగిన అంగీతొడగి, సందిదండెపై రత్నాల కడెమును ధరించి ఎర్రని బురుసాని టోపిని ధరించియుండెను. పల్లకీమోయు బోయీలు మొసలి మొగముల రూపముతో నున్న కొనకొమ్మలు కలిగి పరదాలును, పట్టుకుచ్చులును కల పల్లకిని యువరాజుకై తెచ్చిరి. ఆ బెస్తబోయలు వ్రేలాడు రుమాల చెంగులు కట్టిరి. జేనెడు బాకుల నీలిదట్లలో నుంచిరి. బిళ్ళచెప్పులు తొడిగియుండిరి. మావటీడుపట్టపుదలతిని తెచ్చి నిలిపెను. ఒకడు అలంకరింపబడిన గుర్రాన్ని తెచ్చెను. దానికి హురుమంజిలో సిద్ధమైన జీను, కళ్ళెముండెను. ఫరంగి కేడెమును రాజుకు పట్టిరి. యువరాజు తుక్ఖారమును (తుఖారాదేశపు సమరాశ్వమును) ఎక్కెను. ఆతని యెదుట ఏనుగుల బలము, తర్వాత గుర్రపు బలము, దాని వెనుక రథముల బలము, అటుపై కాల్బలము నడిచెను. యుద్ధవీరమణములు అనగా శంఖ, కాహళ, డక్కా, హుడుక్కాది రవములు దిక్కులు పిక్కటిల్ల మ్రోసెను. ఏనుగుల

  1. రాజవాహన విజయ మను ప్రబంధము నాకు లభ్యము కాకుండెను. నాకు ప్రియమిత్రుడగు శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు సంపాదించి నాకంపిరి. వారికి నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు.