పుట:Andrulasangikach025988mbp.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని కాళహస్తీశ్వర శతకకారుడు వ్రాసెను. అదే విధముగా శ్రీవైష్ణవులు విప్రనారయణునికి వేశ్యాసాంగత్యమును కలిగించి శ్రీరంగనాథ స్వామిచే వేశ్యకు దొంగసొత్తు నిప్పించిరి. ఈ కథ బల్లినవారు సంఘములో మతవ్యాప్తికై అవినీతులను కూడా వ్యాప్తి చేసిన వారై రనుట వారికి తోచక పోయెనేమో? శైవులను వైష్ణవులుగా, వైష్ణవులను శైవులుగా మార్చుట పరిపాటి యయ్యెను. విజయనగర సామ్రాజ్య కాలములో శైవుల ప్రాబల్యము తగ్గెను. బసవ పండితారాధ్య సోమనాథులవంటి ప్రచారకులు లేకపోయిరి. వైష్ణవ ప్రాబల్య మెక్కువయ్యెను. శైవులు బిజ్జల రాజ్యమును వశపరచు కొన్నట్లుగా, వైష్ణవులు రెడ్డి వెలమలను విజయనగర చక్రవర్తులను వైష్ణవులనుగా మార్చివేసిరి. ఆనాటి మన మత పరిస్థితి యిట్టి హీనదశకు వచ్చియుండెను.

వివిధ సాంప్రదాయక వర్గాలవారు తమతమ ప్రాబల్యముగల తావులందితర వర్గములవారిని హింసించుటకు గూడ జంకలేదు. అనేక జైనాలయములను శైవు లాక్రమించుకొని వాటిని శివాలయములనుగా మార్చిరి. వేములవాడలో నేటికిని శివాలయము ముందట ప్రాచీనమందుండిన జైనవిగ్రహాలు తమ యవస్థను తెలుపుకొంటున్నవి. గద్వాల సంస్థానములోని పూడూరు అను గ్రామ మందు పశ్చిమ చాళుక్య శాసనాలున్నవి. అచ్చట ఊరిముందటనే ఒక పెద్ద జైన శాసన మున్నది. అ యూరికి కొంతదూరములో నొక శివాలయ మున్నది. దాని యావరణములో ప్రాచీన జైనవిగ్రహాలు లోపలినుండి తొలగించి బయట నుంచినారు. శైవులను జూచి వైష్ణవులును జైనుల హింసలను ప్రారంభించిరి. జైను లిప్పటి మైసూరురాజ్యములో అనాడింకను మిగిలి యుండిరి. వారిని శ్రీవైష్ణవులు హింసించి శ్రావణ బెల్గోలలోని వారి దేవాలయములను కూల్చిరి. అప్పుడు మొదటి బుక్కరాయలు వారికి సఖ్యత కూర్చి శ్రీవైష్ణవులచేత కూలిన జైన దేవాలయములను బాగు చేయించెను.[1]

విజయనగర రాజులుమాత్రము మతసాంప్రదాయిక ద్వేషాలకు తావిచ్చినవారు కారు. ఒకదిక్కు తురకలు తాము గెలిచిన ప్రాంతాలలో హిందువులను బాధించి, మతముమార్చి, గ్రంథాల నంటుబెట్టి, దేవాలయాలను గూల్చి భీభత్సము చేయుచుండ, హిందువులలో ఐక్యత కలిగించుటయే రాజనీతిగా నుండెను.

  1. Vijayanagara Sexcentenary Commemoration Volume P 42. (ఇక ముందు దీనిని V. S. C. అని యుదాహరింతును.)