పుట:Andrulasangikach025988mbp.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైలమందులు అనునది నిఘంటువులో లేదు. అవి మైకపు మత్తుమందులే అయి యుండును నల్లపూత అంటే చీకటిలో కనబడకుండుటకై ఒంటికి పూసుకొనుపూత. ఈకళ యీవిధముగా నశించిన దన్నమాట! అనేక విషయాలు మనకు తెలియనివైనవి.

తిమ్మభూపరుడు అనుకవి పరమయోగి విలాసము అను పద్య కావ్యమును వ్రాసెను. దానినుండి శబ్దరత్నాకరమందు గ్రద్దగోరు అను పదమువద్ద యిట్లుదాహరించినారు.

        బలపము, కన్నపుగత్తియు తలముళ్ళును, చొక్కు, నీలిదట్టి యిసుము, చీ
        మలక్రోలు, గ్రద్దగోరును, ములుబంతియు, కత్తెరయును మొదలగువానిన్.

ఈపద్యమందు "చోరసాధన విశేషములను" వర్ణించినారు. తలముళ్ళన తలముడి బహువచనము. తల వెంట్రుకలను మడిచి కట్టెడు ముడిబట్టయై యుండును. నీలిదిండు, నీలిదట్టి అనగా నీలిరంగు వేసిన బట్టలను వారు తొడిగిన చీకటిలో కానరాకుందురు. ఇసుము (ఇసుక) ఎదుటి వారికంట చల్లుట కేమో? 'చీమల క్రోలు' నకును, 'పుర్వుల క్రోవుల' కును సంబంధము కానవచ్చెడి. క్రోవు బహువచనమే క్రోలు. అ క్రోవులలో (గొట్టములలో) చీమలునింపి తీసి కొనిపోతూ వుండిరన్నమాట. చీమలు వెలుతురును ఆర్పునా? రెక్కల చలిచీమలీ పనిని చేయునా? అదియు తెలియదు. దీపము చూచిన పుట్టలుగా వచ్చి దానిపై బడు పురువులు కొన్ని కలవు. అవి యీ చీమల వంటి వేమో! దీపము లార్పునవి చీమలు అని పైన వ్రాసినను తర్వాతి కాలపు ఇద్దరు కవులు అ పురుగులు భ్రమరములు అని తెలిపినారు. "భ్రమరాల బట్టిన క్రోవి" అని గౌరన తెలిపినాడు. (హరిశ్చంద్ర, ఉత్తర భాగము, పుట 226.)

"భవనదీపాహిత భ్రమరపేటిక" అని వేంకటనాథ కవి (క్రీ.శ. 1550 ప్రాంతము వాడు) పంచతంత్రములో వ్రాసెను. (3-199) భ్రమరమువలన తుమ్మెదలు కదా! తుమ్మెదలు దీపముల నార్పునేమో! ఎవరైనా పరీక్షించిన కాని తెలియదు. దొంగల పరికరాలను, వారి చౌర్యకళను చాలాచక్కగా వేంకటనాథు డిట్లు వర్ణించినాడు.