పుట:Andrulasangikach025988mbp.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చర్ పర్ అని వర్ణించిన ఆటనే ఉత్తర సర్కారులలో "దాడి" ఆట యందురు. చర్ పర్ అనుటకు మారుగా "దాడి" అని యెదుటివానికాయ నెత్తి వేయుదురు. (ఈ సూచనకు పైవారికి కృతజ్ఞత).

చర్ పర్ ఆట అత్యంత ప్రాచీనమై ఏషియా, యూరోపు ఖండాలలో అన్ని దేశాలలో నుండెనట. మోర్ హెడ్ అను ఆటల నిపుణుడు 'Pocket Book of Games' అను గ్రంథములో మిల్ (Mill) అను నొక ఆటను వర్ణించినాడు. అది పూర్తిగా చర్ పర్ ఆటయే.దాన్ని గురించి అతడిట్లు వ్రాసినాడు. "The Mill is Known to every European school boy. It is unknown in America. It is one of the most, ancient of games. It is seen on the steps of acropolis in Athens, on a Roman tile' on the deck of a Viking vessl." "మిల్ ఆట ప్రతి యూరోపియన్ బడిపిల్లకాయకు తెలిసిన ఆటయే. ఇది అమెరికాలో లేదు. ఇది అత్యంత ప్రాచీన ఖేలనము. ఏతెన్సులోని దేవాలయమందు దాని రేఖలు తీర్చియుండిరి. రోము ఇటికలపై కూడ ఇది యుండెను. నార్వే ప్రభువుల ఓడలపైకూడ దీని రేఖల చెక్కియుండిరి.

ఇదే సందర్బములో జూదమువలన కలుగు నష్టముల నుపన్యసించి, ద్యూతకారుల దృష్టిలో అది మంచి వినోదమే యని వాదింపజేసిన హేతువాదములు విపులముగా విషయభరితముగా నున్నవి. అం దీపద్య మొకటి కలదు.

        "ధనలాభమును పురాణము వినికియు వాద్యంబు యోగవిద్యయు శాస్త్రం
         బున సంగీతముంకావ్యంబులు నాటకములు జూదమున కెనయగునె."[1]

ఆకాలమందు జనులకు పురాణశ్రవణములో చాలా ఆసక్తి యుండెనని తెలిపియుంటిమి. ఇది మరొక నిదర్శనము. యోగవిద్యలో, లోహములను బంగారుచేయు విద్య చేరియుండును. నేటికిని అట్టివిద్యను కొందరు యోగం అని యందురు. ఈ పద్యము వద్దనే,

      "జూదమున ధాతువాదము వాదంబున దొడర చే టవశ్యము కలుగున్"

అని యన్నందున యోగవిద్య నిచ్చట ధాతువాదానికి వాడి యుందురు.

  1. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 86.