పుట:Andrulasangikach025988mbp.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        "చతురంగంబున నే నతి చతురుడ కరి తురగ మంత్రి శకట భట ప్ర
         స్థితి పరహస్తము సేయుదు క్షితిమెచ్చగ రాజు బంటుచే గట్టింతున్"[1]

చతురంగమును మొదట కనిపెట్టినవారు హిందువులు. దానిని అరబ్బులు నేర్చుకొనిరి. అరబ్బుల సైన్యములలో రథములు లేవు కావునను వారికి ఒంటెలె సమృద్ధికావునను, రథములకు మారుగా ఒంటెలను పెట్టి యాడిరి. ఆయాటను యూరోపువాసులు నేర్చుకొనిరి. వారికి ఏనుగులు లేవుకావున వాటికి మారుగా కోటలు (castles) ఏర్పాటు చేసుకొనిరి. తర్వాత నెత్తము (పాచికలాట) ను గురించి తెలిపినారు. అటుపై పులి జూదముల గూర్చి యిట్లు తెలిపినారు

        "తగులు విరివియైన కడుమెచ్చుగ నాడుదు, పులుల మూట, జూదంబులలో
         మిగులగ నేర్పరి బాగిడి తిగుటన్ పొగటాల నే నతి ప్రౌడుండన్.[2]

పులిజూదములు మూడువిధములైనవని కవి తెలిపినాడు. మన దేశములో ఇండ్లముందటి అరుగుబండలపైన, దేవలయాల బండలపైన పులి జూదపు ఇండ్లను మలిపిస్తూ వుండిరి. ఈ యాటను చతుర లతిచాకచక్యముగా ఆడెడివారు. ఇప్పటికిని ఈ ఇస్పేటు (పేక Pack) జూదపు కాలములో కూడా గ్రామలలో పలువురు వృద్ధు లీయాటలం దారితేరిన గంటుపోకలై మిగిలి యున్నారు. ఈయాటలను విరివిగా వర్ణించి సవరించి పటములు వ్రాసి, ఒక ప్రత్యేక గ్రంథముగా మన కాలములో ముద్రించకపోతే మనకు నాలుగైదు నూర్ల యేండ్లక్రిందటి మనపూర్వులు ఆటలేమియు మనకు తెలియరానట్టుగా, మనకాల మందు పూర్వావశిష్టముగా మిగిలి పాశ్చాత్యులచే దిగుమతి యైన పేక జూదపు వెల్లువలో కొట్టుకొనిపోయి నష్టమగును. పాచికల ఆట 20 ఏండ్లక్రిందటి వరకు విరివిగా నుండెను. 20 ఏండ్ల క్రిందట పాలమూరు జిల్లాలలో, రాయలసీమలో, నక్కముష్టి చాలా ఆడుతుండిరి. పులిజూదాలు కూడా విశేషముగా నాడుతుండిరి. కాని యిప్పు డివన్నియు అరుదైపోయినవి నిఘంటుకారులు బాలక్రీడా విశేషము, ఒకవిధమగు జూదము అని వ్రాయటయో లేక అంతమాత్రముకూడా వ్రాయక ఆపదాలనే యెత్తుకొనక పోవుటయో చేయుచున్నారు. ఇది సరియగు పద్ధతికాదు. ఈ విషయమున పరిశోధనలు చేయదలచినవారి కీసూచనలు చేయనైనది.

  1. సింహాసన ద్వాత్రింశిక. భా 2. పు 85.
  2. సింహాసన ద్వాత్రింశిక. భా 2. పు 85.