పుట:Andrulasangikach025988mbp.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూడ్చిపెట్టిన ధనమును (బంగారు, వెండి నాణెములు) భూమినుండి త్రవ్వి తీసుకొనుటకు ముందు దాని నావరించి భూతములు (ధనపిశాచాలు) ఉండుననియు, వాటి శాంతికై బలి నీయవలెననియు జనులు నమ్మిరి. అది నేటికిని కలదు.

      గీ. ........ఎట్టివారి సొమ్మో యిది పెద్ద కాలమయ్యె పృథివి నణగి
         దీని వెడలదివియ బూనిన యప్పుడు భూతతృప్తి వలయు భూతలేంద్రా

      క. అనవుడు విభుడది చేయుద మని గొరియల చెరువు వెట్టియనువగు భో
         జనముల నసురులు సురలును దనియంగా భూతతృప్తి తగ నొనరించెన్"[1]

ఇది భూస్థాపితమగు విక్రమార్కుని సింహాసనమును తీయుటకై భోజుడిచ్చిన బలి (చెరువు=బలి)

ఆకాలపు దనికులు సుఖభోజనము చేస్తూవుండిరి. అందులో జన ప్రియత్వము బ్రాహ్మణులలో నెక్కువగా నుండెను. రెడ్లు శైవులై యున్నందున వారు మాంసాహారులు కారేమో ? నేటికిని శైవులగు రెడ్లు మాంసము తినరు. సాధారణముగా నెరవాటి కాపులు, నానుగొండ కాపులు అను రెడ్డి శాఖవారు మాంసము తినని శైవులు. మరియు మోటాటిరెడ్లలోను కొందరు శైవులై మాంసభక్షులు కానివారై యున్నారు. వైష్ణవ మత మవలంబించిన రెడ్లు మాంసభక్షులయిరి. వైష్ణవాచార్యు లిది నిషేధించినట్లు కానరాదు. ఆముక్తమాల్యదలో రెడ్లభుక్తి విధానమును తెలుసుకొను ఆధారములు కలవు. కవుల వర్ణనలు, విశేషముగా బ్రాహ్మణుల భోజనముగానే కానవస్తున్నది. కొండవీటి రాజ్యమంత్రియగు లింగనమంత్రి పంక్తిలో శ్రీనాథుడు పలుమారు కంఠదఘ్నముగా, తుష్ఠిపూర్తిగా భుజించి ఆమంత్రి అన్నదాతృత్వమును (బ్రాహ్మణుల మేరకు) యిట్లు వర్ణించి ఋణవిముక్తుడయ్యెను.

     సీ. ఖండశర్కరజున్నుకండ చక్కెరలు-దోసెలు, వడల్, సేవెపాసెములతోడ
        కమ్మగా కాచిన కరియాల నేతితో, కమనీయ పంచభక్ష్యములతోడ,
        సంబారములతోడి శాకపాకముతోడ పక్వమైన పెసరపప్పుతోడ,
        తేనియధారతో, పానకంబులతోడ, శిఖర షాడబ రసశ్రేణితోడ,

  1. సింహాసనద్వాత్రింశిక, భా 1. పు 21.