పుట:Andrulasangikach025988mbp.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనిపెట్టెనో లేదో కాని తన కాలమందు ప్రపంచ మందంతటను రసాయనశాస్త్రవేత్త లందగ్రగణ్యుడని పేరు పొందెను. చీనాలో అతడు మహామహిమోపేతుడని ప్రశస్తి నిండుకొనిపోయెను. క్రీ.శ. 1400 ప్రాంతములోని రసవాద విద్యను గౌరన యొకచో నిట్లు వర్ణించెను.

      "ప్రచుర హేమక్రియా పారీణులయిన వారల నెందు నెవ్వారిగాన నేను
       బరగు రసగ్రంధ పటలంబులందు దాతువాదము మీద తహ తహ పుట్టి
       చేతి విత్తము మున్ను చెనటియైపోయె మంత్రవాదులకును మందుమాకులకు
       యంత్రవాదులకు సహాయకారులకు పలుతెరంగుల వెచ్చవడి యౌషధముల
       కలిపి రసంబుల కల్వంబులందు కసబిసగా నూరి కదడుగా బోసి
       వెల పుటంబుల వెట్టి విసవిసనూద పెట పెట మని పడి పెటల పెల్లెగసి
       మటుమాయమై పోవ మది తలపోసి యలసి ఈశ్వర బీజ మది కట్టువడనె
       యిల రసవాదంబు లేల సిద్ధించ,"

వాదభ్రష్టో వైద్యశ్రేష్ఠ:, రసవాదులమూలాన వైద్యశాస్త్రమైనా ఇంతో అంతో లాభం పొందినది.

జనులలో అనేక విశ్వాసాలుండెను. పిల్లలు లేనివారు ఎన్నెన్నో పాట్లుపడిరి. బాలచంద్రుని తల్లి పిల్లలు పడినపాట్లను చాలా విరివిగా పల్నాటి వీరచరిత్రములో వర్ణించిరి. అదే విధముగా ఇతర స్త్రీలు పలుపాట్లు పడుతూ వుండిరి. ఒక స్త్రీ సంతానార్థమై పడిన పాట్లివి:-

      సీ. భక్తితో మాతృ కాభవనంబులకు నేగు, కావించు నతిథిసత్కారములను,
         వాయసంబులకు నిర్వర్తించు దధిబలి, కొలుచు జ్యేష్ఠాదేవి నలఘు మహిమ
         చదివించుకొను పుణ్యసంహితావ్రాతంబు, మూలికామాణిక్యములుధరించు
         తన్వంగి గంధాక్షతలు చిరంటుల కిడు, విప్రశ్నికల గారవించు దరచు,
         కుమ్మరావంబు కడవలు కొల్లవిడుచు బాలురకుతియ్యపండులు పంచియుచ్చు
         చెలులు తానునువ్రతములు సలుపుచుండుతామరసనేత్రపుత్రసంతానకాంక్ష.[1]

  1. శివరాత్రి మహాత్మ్యము. అ 6. ప 40.