పుట:Andrulasangikach025988mbp.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        "త్రైలోక్య విజయాభిదంబైన పౌధంబు
         చంద్రశాలా ప్రదేశంబు"[1]

అని శ్రీనాథుడు తెలిపియున్నాడు.

కాలమును గడియలతో లెక్కిస్తూ వుండిరి. పగలు 30, రాత్రి 30 ఘడియలుగా ఒకటినుండి 30 వరకు ఘడియలను రాజుల భవనాల మోసాలపై కొట్టుతూ వుండిరి. వాటిని విని జనులు కాలమును తెలుసుకొంటూ వుండిరి. వివాహాదులందు నగరాలలో దొరల నగళ్ళలోని గంటలను విని జనులు శుభకార్యాలు జరుపుకొనిరి. అవి లేని పల్లెలలో పురోహితులు "గడియకుడుక" లను (గిన్నెలను) నీటిపైనుంచి అవి నిండి మునుగుక్షణములో వివాహాది కార్యాలను జరుపు చుండిరి.

        "తదుత్సవానందరసనిమగ్నంబగు....శుభలగ్నోదయ సమయ
         సూచకం బగుచు జలంబులందు మునుగు తామ్ర ఘటికాపాత్ర
         నిరీక్షించి మంగళాశీర్వాద పురస్సరంబుగా సుముహూర్తంబ
         నుచు మౌహూర్తికుండు జయమంటపై నక్షతలు చల్లిన"

        "కంగున గంటపై కొడుపుగ్రక్కున వైచుడు తూర్యనాదముల్
         నింగియు దిక్తటంబులును నిండగ విప్రుల వేదనాద ము
         ప్పొంగి చెలంగుచుండె"[2]

        "గడియకుడుకభంగి గ్రహరాజు జలధిలో
         వ్రాల చుక్కలు దలబ్రాలు గాగ
         కెంపు హోమవహ్ని క్రియ నొప్పగా ద్విజ
         రాజు పెండ్లియాడె రాత్రి సతిని"[3]

అని పలువురు సమకాలికవులు విశదముగా వర్ణించి తెలిపినారు.

సహగమనము మధ్య వచ్చిన ఉత్తరహిందూస్థానాచారము. మహమ్మదీయుల అత్యాచారాలు ఏమూలనుండిన అచట యా యాచారానికి అతివ్యాప్తి కలిగెను.

  1. కాశీఖండము - కృత్యాది.
  2. భోజరాజీయము, అ 4. ప 92, 93.
  3. సింహాసన ద్వాత్రింశిక, 1 భా. పు. 102.