పుట:Andrulasangikach025988mbp.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"బంగారు (నెర) చీరలు", "కుసుమం బద్దిన చీరకొంగులు", "చందుర కావి రవికెలు", "యమునారైకలు" మున్నగునవి వారి వస్త్రములు, గాగరా (లంగా)లను బొందిలీలే కట్టిరి. వారు తెనుగువారు కారు.

బోగమువారు దాక్షారామములో, భీమవరములో, విశేషప్రసిద్ధితోనుండిరి. దాక్షారామములో పెదమున్నూరుగుంపు, చినమున్నూరుగుంపు అని బోగమువారి తెగలు రెండుండెను.

         "సురపతి.......భూతలమిచ్చె......
          ........దక్షవాటికావరునకు
          భీమనాథునకు వారవధూ త్రిదశద్వయంబుతో"[1]

జనుల యిండ్లనుగురించి ఆ కాలపు వాఙ్మయము కొంత తెలుపుతున్నది.

         "దోసెడుకొంపలో పనుల త్రొక్కిడి, దుమ్మును, దూడరేణమున్
          పాసిన వంటకంబు, పసి బాలుర శౌచము, విస్తరాకులున్,
          మాసిన గుడ్డలున్, తలకు మాసిన ముండలు, వంటకుండలున్,
          రాసెడు కట్టెలున్ దలపరాదు పురీహితు నింటికృత్యమున్"

ఇది పల్నాటిసీమలోని ముచ్చట. తూర్పుతీరపు జిల్లాలలో నిట్టిది లేకుండి యుండును. పురోహితుని యిల్లే యింత యింపుగా ఉంటే శూద్రుల యిండ్లింకెంత కంపుగా నుండెనో ఏమో ? పల్నాటిసీమలోను, దానికి సరిబోలు కర్నూలు, కడప, అనంతపురపు జిల్లాలలోను, రాయచూరు బళ్ళారివంటి కన్నడ జిల్లాలలోను, వాటి కంటిన బహుప్రదేశాలలోను నేటికిని ఒక దురాచార మున్నది. అదేమనగా, వ్యవసాయకులు పశువులను ఇండ్లలోనే కట్టివేయుదురు. మరియు దొంగలభయముచే ఇండ్లకు కిటికీలు పెట్టరు. ప్రాచీన మందును కిటికీలే రాజభవనాల కుండెనో యేమో, కాని జనుల యిండ్లకు "గవాక్షములు" అను మిద్దెలేని బొర్రలే గాలి వెలుతుర్ల కాధారమయినట్టివి.[2]

ఇండ్ల నమునాలుకూడా పెట్టె బిగించునట్లు ఒకే మోటు నమూనాపై కట్టుతూ వుండిరి. సంపన్నులు మాత్రము పశువులను వేరే యింటకట్టి తాముండు

  1. భీమేశ్వర పురాణము, అ 5. ప 84.
  2. "భోజనాగార గవాక్ష మార్గంబుల వెడలి" కాశీఖండము.