పుట:Andrulasangikach025988mbp.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         "ఉర్వి మెరయించు కార్పాస పర్వతంబు
          చేరి మర్దించె నొక్క పింజారి తరుణి."

అని శ్రీనాథుడు వర్ణించెను. బొందిలీలు ఒక వీరభట కులముగా తెనుగుదేశములో అప్పటికే వచ్చి నిలిచిపోయిరి. బుందేల్ ఖండము (Bundel Khand) అను ఉత్తర హిందూస్థాన ప్రాంతమువారు సైన్యములో యుద్ధభటులుగా చేరి జీవించుటకై ఆంధ్ర కర్ణాట రాజుల సేనలో విరివిగా చేరిరి. వారి స్త్రీలలో జనానాపద్ధతి యుండెను. అందుచేత శ్రీనాథు డొక బొందిలీ మందయాన నిట్లు వర్ణించెను.

        "వన్నెలగాగరా, చెలగు వట్రువ కుచ్చికులందు పాదమల్
         పన్నపువారి భంగముల సంబున నీగెడు బాలకూర్మముల్
         గన్న తెరంగుదోప కరకంజములన్ ముసుకుం బిగించి ప్ర
         చ్చన్న ముఖాబ్జయై నడచె చంగున బొందిలిభామ గోయినన్.

గాగరాయన లంగా, బొందిలీలకు "జనానా" ఆనాడే అలవడియుండెను. ఆనాటి స్త్రీల వేషభూషణాలలో ఎక్కువ భేదము కానరాదు. ముక్కునత్తు, వడ్డాణము, దానికి గజ్జెలు గొలుసు లుండుట, అందెలు (నూపురములు) త్రిసరములు (మూడుదండలు), కంకణము, తాటంకములు (కమ్మలు), ముక్కర (ముత్యాలవి, రత్నాలు పొదిగించినవి), ఇవి సాధారణ భూషణములు.

         "వీసపు ముక్కునత్తు, నర వీసపు మంగళసూత్ర మమ్మినన్
          కాసునురాని కమ్మ లరకాసును కానివి పచ్చ పూసలున్
          మాసినచీర గట్టి యవమాన మెసంగగ నేడు రాగ నా
          కాసలనాటివారి కనకాంగిని చూచితి నీళ్ళ రేవునన్."

         "ముక్కున హురుమంజి ముత్యాల ముంగర
          కమ్మవాతెరమీద గంతు లిడగ"

అను చాటువులు పెక్కు కలవు. స్త్రీలు కాటుక సర్వ సాధారణముగా పెట్టుకొనుచుండిరి. నేటికిని బిడ్డల మొదటిసారి భర్తలిండ్ల కంపితే వడి నింపినప్పుడు కాటుకడబ్బి యిత్తురు.