పుట:Andrulasangikach025988mbp.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"పీలపాగ, మొలలో పెట్టుకొన్న పిల్లనగ్రోలు, మూపున గొడ్డలి, ముసుగు వేసుకొన్న గొంగడి, చేత గుదియ, మెడలో గురిజపూసల పేరు, బొంగులకోల, కాసెదట్టి, బెబ్బులుల వాకట్టు బదనికలు, జింకకొమ్ము, జల్లి చిక్కము, కాపు కుక్కలు" ఇవి ఒక గొల్ల పరికరములు. (నవనాథ - పుట 27)

గొల్లలు గొర్ల మందలనేకాక ఆవులనుకూడ కాచెడివారు "తొలికోడి కూయగానే లేచి తన తోడిగొల్లలతో జేరి ఆవుల పేర్లు పెట్టి పిలిచి పాలు పిదికి నగరికి పంపి తర్వాత మేపుటకై పొలాలకు వాటిని తీసికొనిపోయి, దొంగల నుండి మెకములనుండి రక్షించి మాపటి వరకు మరల ఇల్లుచేరెడివారు. దూడ చచ్చిన ఆవులను సేపునట్లు చేయుట, కడుపులోపలనే దూడ చచ్చిన ఆవులకు మందులిచ్చుటయు వారెరిగియుండిరి. ఆవులకు వచ్చు రోగా లెట్టివనగా,

        "నరుదు కన్నును నీరు నాలిక చేర్లు
         గురుదెవులును గంటి కురును కట్టూర్పు
         కప్పనావురు గాలి గజ్జి పల్ తిక్క
         పుప్పి పంపర యూడు బొడ్డు బొల్గూత
         మొలవిడెసెల తెవులు ముకుబంతికవటు
         తలయేరు తొడకు వాతము కల్ల వాపు
         నలదొబ్బ దెవులును నాదిగా నెన్న
         గల పసరాల రోగములకు నెల్ల
         మందుల బెట్టరు, మంత్రింప తెవులు
         కందువుగని చూడగా నేర్తు నొప్ప."
                                    నవనాథ. పుటలు 29, 30

ఆ కాలములో పింజారులుండిరి. వారు ఇస్లాం మతములో అప్పటికి చేరియుండిరో లేదో! టిప్సూ సుల్తాను కాలములోనో ఔరంగజేబు కాలములోనో వారు బలవంతముగా మతము పుచ్చుకొన్నవారని కొందరందురు. వారు రెడ్డిరాజుల కాలములో మతము మార్చియుండరనుకొందును. కాని వారివృత్తి ఆనాటినుండి ఏకుటయే. దూదేకుట చేతనే వారికి దూదేకు వారనియు పేరువచ్చెను.