పుట:Andrulasangikach025988mbp.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొంగు మూతికి మూడు రంధ్రాలు వేసి దారాలుకట్టి వాటిని కొండ్లుకల ఇత్తడి మసిబుడ్డికి కట్టేవారు. మసిని ప్రతి గ్రామములో జనులే సిద్ధము చేసుకొంటూ వుండిరి. కలము అను పదము ఫార్సీ, ఖలం అనుదానినుండి వచ్చిన దనుకొందురు. కాని సంస్కృతములోనే కలమశబ్దము లేఖిన్యర్థములో వాడుతూ వుండిరి. తెలంగాణాలో గోలకొండ వ్యాపారులు కన్నడము మాట్లాడినవారు కారు. బళ్ళారి, రాయచూరు ప్రాంతాలలోనే కరణాలు కన్నడము మాట్లాడేవారు. వారిని గూర్చియే యీపద్యము చెప్పెనేమో! కాని భయంబై తోచు గడ్డాలు వారెందుకు పెంచిరి. అది తురకల పరిపాలన ప్రాబల్యముండు ప్రాంతాలలో అనుకరించిన వేషమో యేమో ?

"దిచ్చు" అనగా జూదరియని సూ. రా. నిఘంటువులో వ్రాసినారు. దిచ్చుల వేష మిట్లుండెను.

        సీ. చెంగావి వలిపెంబు చెలువుగా ధరియించి
           దళముగా మేన గంధంబు పూసి
           తిలకంబు కస్తూరి తీర్చి జాదుల కలి
           గొట్టుల పొడవుగా కొప్పు వెట్టి
           కందుదుప్పటి గప్పి యందియ డాకాల
           గీలించి పువ్వులకోల వట్టి
           నిద్దమౌ కుచ్చుల యుద్దాలు కిర్రని
           మ్రోయగా నుల్లాసమున జెలంగి
           నలుగు రేవురు సంగడీ లెలమితోడ
           పోకలాకులు నొడిలోన బోసికొనుచు
           జాణతనమున నట్టహాసములు వొలయ
           పెచ్చు రగుచు కొలువగా వచ్చె నొకడు,
           వచ్చి గుడిసొచ్చి యందరు
           దిచ్చులు తన తిండికొరకు తీపులు వెట్టన్
           మెచ్చుచు వేడుక యాటల
           నచ్చోటం బ్రొద్దుపుచ్చి యల్లిన మగిడెన్.[1]

గొల్లల లక్షణా లిట్లుండెను.

  1. సింహాసనద్వాత్రింశిక, భా 2. పు 84.