పుట:Andrulasangikach025988mbp.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దిగదొర్లె" అని వర్ణించినాడు. చొళ్ళెము అనగా జడచుట్టవలె చుట్టిన తలపాగ. జెట్టీలు నేటికిని మెడలో హనుమంతుని విగ్రహముకల బిళ్ళలు కట్టుకొందురు. అరిగెబిళ్ళ యన బిరుదుగా కట్టుకొన్న బిళ్ళ యని యర్థము.

శ్రీనాథుడు మొరస దేశమును వర్ణించెను. మొరసయన మైసూరు ప్రాంతమని శ్రీ మల్లంపల్లివారు, రెడ్డిరాజుల చరిత్రలో ఒకచోట అన్నారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మొరసరాళ్ళెక్కువగానున్న కర్నూలు మండలమనిరి.

మొరస రాజ్య మన మైసూరు సీమ. శ్రీనాథు డాప్రాంతమునకు వెళ్ళి యుండినట్లు ఈక్రింది వర్ణన తెలుపుచున్నది.

         "వంకర పాగలున్ నడుము
          వంగిన కత్తులు మైలకోకలున్
          సంకటి ముద్దలున్ జనుప
          శాకములున్ బలు పచ్చడంబులున్
          తెంకగు నోరి చూపులును
          తేకువ దప్పిన యేసబాసలున్
          రంకుల బ్రహ్మ యీ మొరస
          రాజ్యము నెట్లు సృజించె నక్కటా!

విజయనగరరాజుల దర్బారీవేషాలు విచిత్రముగా నుండెను. పొడవయిన అంగీధరించి పొడవైన టోపీని కుల్లాయిని పెట్టుకొని పెద్దసెల్లా మెడలో వేసుకొని పోవలసియుండెను. కార్యార్థియైన శ్రీనాథుడును ఆ వేషమును వేసుకొనక తప్పదయ్యెను.

          "కుల్లా యుంచితి, కోక చుట్టితి, మహా
           కూర్పాసమున్ దొడిగితిన్"

అని తెలుపుకొనెను. కుల్లాయి మనదేశ వేషమా లేక తురకలనుండి అనుకరించిన వేషమాయని సందేహము కలుగును. కుల్లాయి అనున దించుమించు మూరెడుపొడవుదై తలక్రిందుగానుంచిన కాగితముపొట్లమువలె నుండునట్టిది. ఆ కాలపు ఆళియ రామరాజాదుల చిత్తరువులనుచూచిన తెలియరాగలదు.