పుట:Andrulasangikach025988mbp.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         "అవని నవంతిభూమి వరు
          డాదిగ పార్థివులెల్ల లక్ష్మియు
          త్సవములు మున్నుగా కడు ప్ర
          శస్తములౌ సమయంబులందు స
          త్కవులను, పాఠకోత్తముల,
          గాయకులన్, నటులన్, వితీర్ణవై
          భవముల దన్పజొచ్చిరి ప్ర
          భావసమృద్ధుల నింపు పుట్టగన్."[1]

కవు లనుభవించిన వైభవముల కొన్ని శ్రీనాథుడు తెలిపినాడు. వారికి రత్నాంబరములు, కస్తూరి, హేమపాత్రాన్నము, దినవెచ్చము, మున్నగునవి లభించెను. పైన తెలిపినవి విశేషముగా బ్రాహ్మణుల విద్యలై యుండెను.

"బ్రాహ్మణు లెట్టి విద్య నభ్యసించుచుండిరో శ్రీనాథుని యీక్రింది వాక్యము తెలుపును."

"మథుర యను పట్టణంబున శివశర్మ యను విప్రోత్తముండు గలడు. అతడు వేదంబులు సదివి, తదర్థంబు లెరింగి, ధర్మశాస్త్రంబులు పఠించి, పురాణంబు లధిగమించి, యంగంబు లభ్యసించి, తర్కంబు లాలోడించి, మీమాంసా ద్వయం బాలోచించి, ధనుర్వేదం బవగాహించి, నాట్యవేదంబు గ్రహించి, యర్థశాస్త్రంబు ప్రాపించి, మంత్రశాస్త్రంబులు తెలిసి, భాషలు గఱచి, లిపులు నేర్చి, యర్థం బుపార్జించె" (కాశీఖండము, 3-29)

రాజులు కావ్యనాటకాలను, సాహిత్యశాస్త్రమును, సంగీతనాట్యశాస్త్రములను ఎక్కువగా నభ్యసించి రనుటకు రెడ్డిరాజులు వ్రాసిన శాస్త్రాలు, చేసిన వ్యాఖ్యలే ప్రథమసాక్ష్యములు. అవికాక వారికి అశ్వశిక్షణము, అశ్వశాస్త్రము, గజ శాస్త్రము, రాజనీతి, యుద్ధతంత్రము ముఖ్యములైన విద్యలు, రాజనీతిని గూర్చిన శాస్త్రములు సంస్కృతములో నెక్కువగా నుండెను. తెనుగులో మడికి సింగన సకలనీతిసమ్మతము వ్రాసెను. అందతడు పలువురి తెనుగు నీతికవుల నుదహరించెను. ఆ కవులలో పెక్కుకవుల గ్రంథాలు మనకు లభించుటలేదు.

  1. సింహాసనద్వాత్రింశిక, భా 2. పు 27.