పుట:Andrulasangikach025988mbp.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          కిసలయ తూలికం గొని లిఖింతురు కబ్బము లెన్నగా మహా
          వ్యసనముతో నిజాసన వియత్తల తాళపలాశ రేఖలన్"
    అని శ్రీనాథుడు వర్ణంచెను.

పూర్వము లెక్కలు వ్రాయువారు కరణాలై యుండిరి. వారు మొదట పన్ను వసూళ్ళ లెక్కల కధికారులు కారు. ఆదిలో పన్నువసూలు చేయువారు విశ్వబ్రాహ్మణులను కమసాలులు. నేటికిని అందందు వారు గ్రామ కరణాలుగా కనబడుతున్నారు. రాయని భాస్కరమంత్రి వారిని తొలగించి బ్రాహ్మణ నియోగులను ఏర్పాటు చేసెనని కొన్ని కథలు చెప్పుదురు.

లెక్కలు వ్రాయు కరణాలు అసాధ్యులనియు, దుర్మార్గులనియు అనిపించుకొనిరి. వారు లెక్కలను "వహి" అను పుస్తకాలలో వ్రాయుచుండిరి. (నేటికిని హిందీలో లెక్కపుస్తకాలను బహి అందురు.) వారు లెక్కలెట్లుంచిరో (Book Keeping) కొంత మనకు తెలియవస్తున్నది. "వ్రాతకానిని నమ్మరాదు"[1] అన్న అపఖ్యాతి వారి కుండెను.

        క. ఒకదెస దెచ్చిన యాయం
           బొకదిక్కున చెల్లు వ్రాసి యొకదెస వ్యయ మ
           ట్లొక దిక్కున జన వ్రాసిన
           బ్రకటంబుగ వాడు మిగుల పాపాత్ముడగున్.

        క. వహి వారణాసి యనగా
           మహి బరగిన దిందు కపటమార్గంబుగ నా
           గ్రమున వ్రాసిన వానికి
           నిహపరములు లేవు నరక మెదురై యుండున్.

        గీ. రానిపైడి చెల్లుట వ్రాయుట యాయంబు
           తక్కువై వ్యయంబ దెక్కుడౌట
           లెక్క తుడుపువడుట లిపి సందియంబౌట
           చెల్లు మరచుటయును కల్లపనులు.

  1. సిం. ద్వాత్రింశిక, భా 2. పు. 104