పుట:Andrulasangikach025988mbp.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గిరిరెడ్డికి వసంతరాయడను బిరుదముండెను. అతనికన్న పూర్వుడగు రాజుకును అదే బిరుదమున్నను ఇతనికే అది ప్రధానమయ్యెను. ఇతడు ఏటేట వసంతోత్సవములను చేస్తూవుండెను. అందు కర్పూరమును విశేషముగా ఎగజల్లినవాడగుటచేత కర్పూర వసంతరాయడను బిరుదము కలిగెను. ఈ యుత్సవాలకు కావలసిన సుగంధద్రవ్యములను జావా, సుమిత్రాది తూర్పు దీవులనుండి తెప్పించుటకును వాటిని పెద్దభవనములలో నింపి సుగంధభాండాగారాధ్యక్షపదవిని నిర్వహించుటకును అవచి సెట్లు నియుక్తులై యుండిరి. "అమ్మహారాజునకు ప్రతిసంవత్సరంబును వసంతోత్సవంబుల కస్తూరీ కుంకుమ సంకుమద (జవ్వాజి) కర్పూర హిమంబు (పన్నీరు) కాలాగరు గంధసార (చందనము) ప్రధానంబులగు సుగంధ ద్రవ్యంబు లొడగూర్చియు చీని సింహళ తవాయ హురుమంజి జోణంగి ప్రభృతి నానాద్వీపనగరాకరంబుల దెప్పించు" చుండెను. సుగంధ ద్రవ్యములన్నియు ఇండోనీషియా దీవులనుండియే నేటికిని వస్తూవున్నవి. ఆ కాలములో, పైవికాక సింహళమునుండి ఏనుగులు, హురుమంజి (పర్షియా అఖాతతీరము) నుండి గుర్రములు వచ్చెను. పూర్వము గుర్రాలకు పర్షియాదేశమే ప్రసిద్ధి. తురక సుల్తానుల సేనలో గుర్రాలెక్కువగా నుండెను. రెడ్డిరాజులు, విజయనగర రాజులు గుర్రాలను కొనుటలో చాలావ్యయము చేస్తూవుండిరి. ముత్యాలు సింహళమునుండియే దిగుమతి యయ్యెను. చీనానుండి పట్టుబట్టలు వచ్చెను.

రెడ్డిరాజులకు నిరంతరము ప్రక్కరాజ్యాల రాజులతో యుద్ధాలుండినందున వా రాయుధములను విస్తారముగా చేస్తూవుండిరి. కమ్మరివారే ఆయుధాలు చేయువారు. కుంపటిలో చిన్న చిన్న లోహములను కాచి ఆయుధాలు చేయుచుండిరి. ఆయుధాలలో కత్తి, చురిక, బల్లెము, ఈటె, బాణము ముఖ్యమైనవి. పంచలోహములతో జయస్తంబములను, ఆయుధములను చేసిరి. రాజుల కొలువు చవికెల"ను కూడ పంచలోహములతో చేసిరి.2 ఆంధ్ర

_______________________________________

1. హరవిలాసము. కృత్యాదులు.

2. "పంచలోహ కల్పితం బగు నతని కొలువు చవికె" (భోజరాజీయము, అ 2. ప 113.)