పుట:Andrulasangikach025988mbp.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవచి తిప్పయ "తరుణాసీరితవాయి గోపరమణాస్థానము" ల నుండి సుగంధద్రవ్యములను తెప్పించెను. ఆ ప్రదేశము లేవియో ఆ చిక్కును గూడ శ్రీమల్లంపల్లివారే విడదీసినారు.

"తరుణాసీరి - మలయాద్వీపకల్పములోనిది. దాని నిప్పుడు టెనస్సరిం (Tenassarim) అని యందురు.

తవాయి - (Tavoy) ఇదియు మలయాలోనిది.

రమణ - పెగూలోని రమన్న దేశము.[1]

వ్యాపారము చేయువారిలో బలిజలు, కోమట్లు ముఖ్యులు. బలిజశబ్దము వణిజశబ్దమై యుండును. పూర్వము బలిజలకే సెట్టి అను బిరుదముండెను. తర్వాత కోమటులును వారివలనే ప్రధానముగా వర్తకులైనందున వారు సెట్టిబిరుదమును స్వీకరించి యుందురు.

పెద్దపెద్ద గ్రామాలలో వారమున కొకమారు సంతలు సాగుచుండెను. కొన్ని సంతలలో ప్రత్యేక వస్తువులు మాత్రమే యమ్ముచుండిరి.

          "... మూటెడు ప్రాలకు నూనె సంతలో
           గొన జనుదెంచి బియ్యమున
           కున్ సరితైలము పోయుమన్న నా
           తనిపలు కెవ్వరున్ వినక ..."[2]

అను మాటలనుబట్టి ఆ కాలమున నూనె సంతలవంటి ప్రత్యేకపుసంత లుండెనని తెలియును. మరియు ధాన్యమిచ్చి కావలసిన సరకులు కొనిరనియు బియ్యమునకు సరి తైలము లభింపకుండెననియు "ప్రాలేడుమానికెలకుం దైలము మానెడు పురమ్ముధారణ"[3] అనియు తెలియవస్తున్నది. ఏడు మానికెల బియ్యానికి ఒక మానికె నూనె, అప్పటి బజారుధర. అధారణను (హిందీలో నిప్పటికిని ధారణ్ అందురు) పురములోని వర్తకశ్రేణి నిర్ణయించియుండెను.

  1. Hist. R. K. Page 412-413.
  2. కేయూర బాహుచరిత్ర, అ 2 ప 9.
  3. కేయూర బాహుచరిత్ర, అ 2 ప 10.