పుట:Andrulasangikach025988mbp.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పరిస్థితులు రాయలసీమకును వర్తించును. ఇక తూర్పుతీరమందుండు కృష్ణా గోదావరి జిల్లాలలోను, నెల్లూరు జిల్లాలోను, విశాఖ పట్టణము జిల్లాలోను వ్యవసాయపరిస్త్జితు లెట్లుండెనో తెలిసికొందము. శ్రీనాథుడు కృష్ణాజిల్లాలో నెక్కువగాఉండి సన్న బియ్యపుటన్నమును బహు విధ రుచ్యాహారములను ఆరగించినవాడగుటచే, పలనాటికిపోయి జొన్నకూడు తినలేక అవస్థపడి లోతులో దొరకు నీటికై భంగపడి పలనాటిని తిట్టి వెళ్లెను. తూర్పుతీరమందలి డెల్టా (లంక) భూములలో ఏటిమడలలో నానావిధములగు వరిధాన్యములు పండుతూవుండెను. వడ్లలో అనంతమగు జాతులు కలవు. శ్రీనాథుడు కొన్నిటిని తెలిపినాడు.

"నదీమాతృకాయమాన విశ్వంభరాభరిత కలమశాలిసిరా ముఖషాష్టిక పతంగ హాయనప్రముఖ బహువిధవ్రీహీభేదములు"[1]

గోదావరిలంకలలో బహువిధఫలములు సమృద్ధిగానుండెను. తూర్పుతీరము ధాన్యసస్యసంపత్సమృద్ధముగా నుండెనని ఆకాలమున దేశమును చూచిన జోర్డానస్ (1327 - 30) అను పాశ్చాత్యు డిట్లు వ్రాసి పెట్టెను.

"తెలుగు దేశపురాజు బహుప్రతాపవంతుడు. అతని రాజ్యములో పుష్కలముగా జొన్నధాన్యము, వరి, చెఱకు, తేనె, పప్పుదాన్యాలు, గ్రుడ్లు, గొర్లు, దున్నలు, పాడి, వివిధములగు నూనెలు, శ్రేష్ఠములగు ఫలములు మరెందును లభ్యముకానట్టివి సమృద్ధిగా లభిస్తున్నవి"[2]

దీన్నిబట్టి ఆ కాలమందలి దేశము చాలా సుఖస్థితిలో నుండెననుటలో సందేహములేదు. కృష్ణాజిల్లాలోనిది కాబోలు కళసాపురము, అరటితోటలకును, ద్రాక్షఫలములకును ప్రసిద్ధికలదై యుండెను.[3]

రాయలసీమలోని ఎక్కువభాగము కర్ణాటరాజ్యములో చేరియుండెను. అందు పల్నాటిలోవలె ధనిక దరిద్ర భేదములేక అందరును దున్నుట, నూలు వడకుట, అందరునూ జొన్న రొట్టెలు, జొన్నసంకటి లేక యంబలి లేక

  1. హరవిలాసము, ఆ 1. ప. 10.
  2. Hist. R. K. Page 373.
  3. "కళసాపుర ప్రాంతకదళీ వనాంతర ద్రాక్షాలతాఫల స్తబకములకు" శ్రీనాథుని చాటుధార.