పుట:Andrulasangikach025988mbp.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏటేటకో లేక నియమిత కాలమునకో గ్రామ జనుల కిచ్చెడువారు. రైతులు తమకుండు పశువుల లెక్క ప్రకారము కాండ్ల లెక్కతో కలిసి కృషిచేసి సమష్టిలోనే సేద్యపు వ్యయమును తీసివేసి అనగా పన్నిద్దరాయగాండ్లకు ధాన్యరూపముగా వారి కియ్యవలసిన దిచ్చివేసి ప్రభుత్వమునకు ఇయ్యవలసిన షడ్బాగపు పన్నును తీసి యుంచి మిగతాది కాడీలప్రకారము పంచుకొనుచుండిరి. ఈవిధమగు సమష్టి సేద్యములో రాజులు బ్రాహ్మణుల కిచ్చిన ఇనాములు అగ్రహారములు చేరియుండ లేదు. సమిష్టి సేద్యపు భూమినుండి మొదలు (అగ్ర) బ్రాహ్మణుల ఇనాముల తొలగించి (హారము) భూమిని సాగుకు తీసుకొనుచుండిరి.

ఆ కాలములో భూములను కొలుచుటకు "గడి" యనునొక నిర్ణయమగు పొడవు కట్టెను వినియోగిస్తుండిరి. దానిని కేసరిపాగడ యనిరి. భూములను కొలుచుటకుగాను శాస్త్రగ్రంథాలు వ్రాసిరి. నన్నయభట్టు సమకాలికుడగు మల్లన అనునతడు గణితశాస్త్రమును వ్రాసెను. అదింతవరకు ముద్రితము కాలేదు. దానిలో ఆకాలపు వ్యవసాయ స్థితిగతులు కొలతలు మున్నగునవి కలవందురు. సంస్కృత గణితశాస్త్రములను తెనుగులోనికి పలువురు అనువదించిరి. క్షేత్ర గణితము అను పేరుతో పొలముల నక్షాలతోసహా తాటాకులపై పెద్దపెద్ద గ్రంథాలు వ్రాసియుంచిరి. కాకతీయులకాలమందలి క్షేత్రగణితమునుండి శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు విపులముగా నుదాహరించినారు. దాని ప్రకారము,

         అంగుష్ఠపు వలయార్థం
         బంగుళమగు, మూడుపొడవు యవ లెన్నంగా
         నంగుళమగు, మరియును, మ
         ధ్యాంగుళ మధ్యప్రదేశ మంగుళ మయ్యెన్.
     
                 అట్టి 12 అంగుళములు = ఒక జేన
                 32 జేనలు = ఒకగడ (కొలతకట్టె).

ఆకాలమందు తూమెడుపొలము అంటూ వుండిరి. నిన్న మొన్నటివరకును రాయలసీమలో ఇవే మాటలంటూ వుండిరి. అనగా తూమెడు విత్తనములు పట్టెడు భూమియని యర్థము.