పుట:Andrulasangikach025988mbp.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిన తర్వాతికాలమున రాజ్యపదవులను వహించినవారు గావున నవీన బ్రాహ్మణోత్తములు వీరిని క్షత్రియులనుగా పరిగణింపక చతుర్థ వర్ణములో నుత్తములనుగా వర్ణించియుండిరి.[1]

పదునేనవశతాభ్ది ప్రారంభమునందు గూడ కొండవీడు, రాజమహేంద్రవరము పాలించిన రెడ్లకును, రాచవారికిని సంబంధ బాంధవ్యములు కలవని (శివలీలావిలాసము, కొరిమిల్లిశాసనము) పైదృష్టాంతములు వేనోళ్ళ జాటు చున్నవి.[2]

"చతుర్థకులము" క్షత్రియకుల సమమని శ్రీనాథుడు డొంకతిరుగుడుగా భీమేశ్వరపురాణాదిలో వర్ణించుతూ "అందు పద్మనాయకు లన, వెలమలన, కమ్మలన, సరిసర్లన, వంటర్లన, బహు ప్రకారశాఖోపశాఖాభిన్నంబులైన మార్గంబులన్"[3] వెలసిరనెను.

అందు పంటదేసటి అను రెడ్డివంశ మొకటి అని తెలిపినాడు. పై శ్రీనాథ వచనములో నరిసర్లు అన నేజాతియో తెలియదు. వంటర్లు అని ముద్రితపాఠమందు కలదు. వంటరి అన వంటలవాడు. ఇది సరియని తోచదు. బహుశా అది ఒంటరి (ఏకవీరుడు) అయి యుండును. పద్మనాయకులు వేరు, వెలమలు వేరు అని పై వచనాభిప్రాయముగా కానవస్తున్నది. మున్నూరుకులమును గూర్చి కొరవి గోపరాజు తన సింహాసనద్వాత్రింశతి ప్రబంధాదియందు తెలిపినాడు. కాని అది తప్పు; చారిత్రికవిరుద్ధము.

రెడ్డి పదోత్పత్తినిగూర్చి పలువురు విమర్శకులు చర్చలుచేసి తేల్చిన సారాంశమేమనగా క్రీస్తుశకము ఆరేడునూర్లసంవత్సరములనుండి యీశబ్దోత్పత్తి కానవస్తున్నది. పూర్వము వీరు చిన్న భూభాగముల కధికారులై యుండినప్పుడు రట్టగుడ్లు అనబడిరి. రట్ట అన రాజ్యము; గుడి అన గుత్త, అనగా వ్యవసాయనిమిత్తము, గ్రామాలరక్షణ నిమిత్తము భూములను పొందినవారిని యర్థము. రట్టగుడియే క్రమముగా రట్టఉడి, రట్టాడి, రట్టడిగా మారెను. రట్టడిపదములను పండితారాధ్యుడు తన శివతత్త్వసారములో వాడెను. తర్వాతి కవులు గ్రామాధి

  1. ఆంధ్రుల చరిత్ర, సంపుటము 3. పుట 132.
  2. ఆంధ్రుల చరిత్ర, సంపుటము 3. పుట 264.
  3. భీమేశ్వరపురాణము, అ 1. ప 32.