పుట:Andrulasangikach025988mbp.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        తొడల, రెప్పల, తొడితొడి దీపవితతు
        లలరంగ బెనుదివియలు, నారసములు.

గలయంగ నిరుమెయిగాడ సంధించి (పం. చ. పుట 409) భక్తిని ప్రకటించినవారును, నాలుక లుకోసి, చేతులు నరికి, చన్నులుకోసి, తలలుకోసి, తనువుల నర్పించువారును (పం. చ. పుట 407) బహుళముగానుండిరి. కావున శ్రీశైలములో ఒక అనువయిన శిఖరమును దాని క్రింద లోతైన లోయయు చూచుకొని అచ్చట భృగుపాతము చేసి ప్రాణాలిచ్చెడి వారనిన చిత్రము కాదు. అది తిక్కన, సోమనల కాలానికే సుప్రసిద్ధమైన కనుమారి యయ్యెను.

జనులలో శకునాలపై విశ్వాసము మెండుగా నుండెను. ఒక రాజకుమారుడు వేటకు వెళ్ళగా అతని కెదురయిన అపశకున పరంపర యెట్టిదనగా:-

       సీ. పిల్లులు పోరాడె, బల్లి యూకర త్రెళ్ళె,
                తమ్మళి పొడసూపె, తుమ్మి రెదుర,
          తొరగుపోయిన లేగ కొరలుచు నొక కుర్రి
                పరతెంచె, క్రంపపై నరచె కాకి,
          ఉలుమ డొక్కడు నూనె తలతోడ నేతెంచె,
                మైల చీరలచాకి మ్రోల నెదిరె
          కాకియును, గోరువంకయు, రెక్కలపోతు,
                నేటిరింతయు దాటె నెడమదిశకు

          బైటవెరపు దప్ప పాలగుమ్మయు పారె
          ఒంటిపాట పైడికంటి వీచె
          ఎలుగుచేసె పెద్దపులుగు, పామటు తోచె
          దబ్బి బొబ్బలిడియె నుబ్బు లడర.[1]

(కుర్రి=పాడియావు, పాలగుమ్మ=పాలపిట్ట, పెద్దపులుగు=పెద్దపిట్ట, గుడ్లగూబ, ఱెక్కలపోతు, దబ్బి అనునవి నిఘంటువులలో లేవు. ఉలుమడు అనగా కుష్ఠురోగియని సూ.రా.నిఘంటువులలో కలదు. (ఱెక్కలపోతు అన బట్టమేక అను పెద్దపక్షి యనియు, దబ్బియన ఒక పక్షియనియు ఊహింతును.)

  1. సింహాసనద్వాత్రింశిక, భా 1. పు 25.