పుట:Andrulasangikach025988mbp.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతి ఆమాసకొక పేరు కలదు. ఇవి కాకతీయకాలమున నుండియే యేర్పడుతూ వచ్చెను. "దవనపున్నమ" (ఏరువాక), "నూలిపున్నమ" (శ్రావణపూర్ణిమ-నూలు=దారము) అను వాటిని పాల్కురికి సోమన తన పండితారాధ్యచరిత్రలో పేర్కొనెను. వ్రతములను స్త్రీలు విశేషముగా చేయుచుండిరి. అవి యెక్కువగా సంతానమును, ఐశ్వర్యమును కోరి చేసినట్టి కామ్యకవ్రతములు.

భైరవాది శివభక్తులను, కాళ్యాది శక్తిరూపిణులను పశుబలిచే తృప్తి పరిచెడివారు. అట్టి సూచనలు వాఙ్మయములో పలుదావుల కలవు. కాని శైవమతములో శాక్తేయము, భైరవతంత్రము మున్నగు వామాచారములను పురికొలుపు తంత్రవాఙ్మయము బహుళ మయ్యెను. జనులు వీరశైవవులై ఆవేశ పూరితులై అందందు ఆత్మబలిదానము కావించుకొన్న కథలను పాల్కురికి సోమనాథుడు తెలిపియేయున్నాడు. శివపూజలలో ఆత్మబలిదానము చేసుకొన్న వారిని, లింగాయత మతమునకై తలపండు నిచ్చినవారిని, వీరులుగా పరిగణించిరి. వారిస్మరణార్థము "వీరకల్లు"లను అందందు స్థాపించిరి. అనేక గ్రామ బహి:ప్రదేశములలో ఛురికతో కడుపుల ఛేదించుకొన్నట్లు, తలల కోసికొన్నట్లు తీర్చిన శిలావిగ్రహములు నేటికిని కానవచ్చును. వీరులపూజకై "వీరగుడ్డముల"ను అభిమానులు కట్టించిరి.

శక్తిరూపములతోనుండు గ్రామదేవతలు శివరుద్ర రూపాలతోనుండు దేవర్లును, ద్రావిడ దేవతలే! చనిపోయినవారిలో కొందరు దయ్యాలై, శక్తి రూపిణులై, శివశక్తులై తమను, బాధించునని జనుల విశ్వాస మాదికాలము నుండి నేటివరకు అవిచ్ఛన్నముగా వృద్ధికి వచ్చినట్టిది. మనప్రాచీనుల కాలమందిట్టి విశ్వాసాలుండి నటుల కవుల చాటువులందు రచనలందు పలుమారు వెల్లడియైనది. శ్రీనాథుడు తన చాటువులందును పీఠికలందును ప్రజల యాచారవిశ్వాసములను తెలిపిన భాగములు చాలా విలువగలవి. పలనాటిలోని దేవర్లనుగూర్చి యతడు కొన్నిచాటువులు చెప్పెనందురు. అందొకటి యిట్టిది.

        "వీరులు దివ్యలింగములు, విష్ణుడు, చెన్నుడు, కల్లుపోతరా
        జారయ కాలభైరవుడు, నంకమశక్తియు నన్నపూర్ణ."

అని డాక్టర్ నేలటూరి వేంకటరమణయ్యగారు (Origin of the South Indian Templeలో) ఉదహరించినారు. తక్కినభాగాన్ని ఉదహరింపలేదు.