పుట:Andrulasangikach025988mbp.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందూ దూషణగల హాషిమీ అనువానిచే రచితమగు హిందూస్థాన చరిత్రను చదివిస్తున్నారు. హిందూ మతాభిమానులు ప్రపంచ మంతటను తమ పూర్వులే ఘనులని కొన్ని చరిత్రలను వ్రాసిరి. ఇవన్నియు పాక్షికము లగుటచే అనాదరణీయము లగును. ఇటీవల సరియగు భారతీయ చరిత్రను వ్రాయించుటకై జాతీయ నాయకులు సమాలోచనలుచేసి అందు గుప్తరాజుల చరిత్రను ప్రకటించిరి. ఆది యాదర్శమగు చరిత్ర గ్రంథము. 1949 సంవత్సరములో ప్రకటితమైన శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి "రెడ్డిరాజ్యాల చరిత్ర" అను ఇంగ్లీషు గ్రంథము కూడ అట్టిదే.

మన దేశమందలి అటవికులగు చెంచు, ముండా, గోండు, సంతాల్, నాగులు మున్నగువారిని గూర్చి బహు గ్రంథాలు కలవు. మన దేశములోని కులములను గూర్చి థర్ స్టన్ (THURSTON"S Castes and Tribes of South India) ఏడు పెద్ద సంపుటాలు ప్రకటించెను. హైద్రాబాదు రాష్ట్ర మందలి కులాలను గూర్చి సిరాజుల్హసన్ అనునతడు పెద్ద గ్రంథాన్ని ప్రకటించెను. భారతీయ ప్రాచీన జాతుల (Tribes of Ancient India) ను గూర్చి ఒక బెంగాలీ వ్రాసెను. ఈ విధముగా కొన్ని గ్రంథాలు వెలువడెను కాని జనుల సాంఘిక చరిత్రలు ప్రత్యేకముగా ప్రకటిత మగుట అరుదు.

మన తెలుగులో సాంఘిక చరిత్రలు లేవు. వాటిని వ్రాయవలెనని పలువురు సంకల్పించినట్లున్నది. చిలుకూరు వీరభద్రరావుగారు ఆంధ్రుల చరిత్రము రెండవ భాగములో వెలమ వీరుల చరిత్ర ప్రకరణాదిలో (పు 271) పుట అడుగున నిట్లు వ్రాసెను.

"ఆంధ్రుల సాంఘిక చరిత్రము ప్రత్యేకముగా విరచింపబడుచున్నది. కావున నీ విషయమై (వెలమాది జాతులవిషయమై) యిందు సవిస్తరముగా జర్చింపబడును."

ఆ చరిత్రను వ్రాయనేలేదేమో! వ్రాయ సంకల్పించియుందురు. అట్టి సిద్ధహస్తుని వ్రాత మనకు లభింపదయ్యెను. అదే విధముగా పలువురు వ్రాయ సంకల్పించినట్లున్నది. శ్రీ నేలటూరు వేంకటరమణయ్యగారి వ్యాస మింగ్లీషులో ఆంధ్ర చరిత్ర పరిశోధక సంఘ పత్రికలో క్రీ.శ. 1938 లో ముద్రితమైనది. నే నీ గ్రంథములోని నాల్గవ ప్రకరణము వ్రాయునప్పుడు దానిని చూడ దటస్థించినది. నేను నిర్ణయించుకొన్న మార్గములనే వారు సూటిగా వాటినే సూచించి