పుట:Andhrulacharitramu-part3.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుఱ్ఱముల కధికారిగా నియమించునట్లు చేసెను. ఆ బ్రాహ్మణు డప్పుడు వానింజూచి 'ఓయీ! యికముందు నీకు రాజ్యము సంప్రాప్తింపగలదు; అప్పుడు నన్ను మఱువకు మీ' యని చెప్పి పంపివేసెనట! ఇత డనేకయుద్ధములలో జక్రవర్తిపక్షమున బోరాడి శత్రువులను జయించి చక్రవర్తికి జయము సమకూర్చుటంజేసి యాతడు మెచ్చుకొని 'జాఫర్‌ఖాన్‌' అనుబిరుద మాతని కొసంగెనట! ఇతడు 1343 లో దక్షిణహిందూదేశములోని రాజులసాహాయ్యమును బడసి చక్రవర్తియధికారమును ధిక్కరించి స్వతంత్రుడై కలుబరిగిపట్టణమునకు హసనాబా దని పేరుపెట్టి రాజధానిగ జేసికొనియెను. తాను రాజ్యాధిపత్యమును వహించినపిమ్మట దనపూర్వపుయజమానుని మఱచిపోక యాబ్రాహ్మణుని తన కోశాధ్యక్షునిగా నియమించుకొనియెను. అతని జ్ఞాపకార్ధమై 'హసన్‌గంగూ' అని తనకును, 'బహమనవంశ' మని తనవంశమునకును పేర్లుపెట్టుకొని వ్యవహరింప మొదలుపెట్టెను. మఱియు నితడు 'అల్లా ఉద్దీన్ షాహ' అను బిరుద నామమును గూడ వహించెను. ఇతడు హిందూమతద్వేష్ట కాకపోయినను, తనపని తీఱిన వెనుక హిందూరాజులతోడ స్నేహమును చాలించెను. వీనిరాజ్యము విశేషముగా మహారాష్ట్రదేశమున వ్యాపించి యుండెను. కలుబరిగిపట్టణము