పుట:Andhrulacharitramu-part3.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమునకుఁ బోయి క్రీ.శ. 1325 వ సంవత్సరమున మహ్మద్ బీన్ తుఘ్‌లఖ్ అను బిరుదునామమును వహించి సింహాసనమధిష్టించెను.

తెలుఁగు నాయకులు తురుష్కులను జయించుట

అయినను రాజమహేంద్రపురరాజ్యము స్వల్పకాలము మాత్రమే తురుష్కుల స్వాధీనమందుండెను. మంచికొండ కూనపనాయకుఁడను మహావీరుఁ డొకఁడు ప్రోలయనాయకుఁడనువాని సహాయముతో రాజమహేంద్రపురమునందలి తురుష్కులను జయించి డిల్లీ చక్రవర్తి పాలనమును కడముట్టించి రాజమహేంద్రపురమునకు నీశాన్యమూలను పదునొకండు మైళ్ళ దూరమున కోరుకొండయను ప్రదేశమున నొక దుర్గమును నిర్మించి ప్రజాపరిపాలనము చేయ నారంభించెను. ఏకశిలానగరమునకును విజయవాటిక (బెజవాడ) కును రాజమహేంద్రపురమునకును నడుమనుండు దేశమును కాకతీయ రాజబంధువు లగు రాచవారు పరిపాలనము చేయుచుండిరి.

ప్రతాపరుద్రుని సేనానులలో నొక్కఁ డగు దొడ్డారెడ్డికి దౌహిత్రుడైన ప్రోలయ వేమారెడ్డి యనునాతఁడు కృష్ణానదికి దక్షిణ పార్శ్వమునందున్న కొండవీడు వినుకొండ రాజ్యముల నాక్రమించుకొని అద్దంకి రాజధానిగా శత్రుజనభయంకరుఁడై ప్రజాపరిపాలనము చేయుచుండెను.