పుట:Andhrulacharitramu-part3.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలనను ఆంధ్రభాషాసాహిత్యపరిషత్తు (Telugu Academy) ఏర్పడినది. "ఆంధ్రదేశచరిత్రాంశ పరిశీలనకు బ్రోత్సాహ మొసంగుటయు, లభ్యములైన వానిలో మిక్కిలి విశ్వసనీయములైన యాధారముల సాహాయ్యమున సవిస్తరముగా దెలుగుదేశము యొక్కయు బ్రజలయొక్కయు, చరిత్ర మొకటి రచించి ప్రచురించుట పరిషత్తుయొక్క ప్రథానోద్దేశములలో నొకటిగా దెలుపబడియెను. ఇది యొక శుభసూచక మని తలంచితిని గాని నాప్రతిపక్షుల ప్రయత్నముల మూలమున నే నాపరిషత్తును సమీపించుటకే సాధ్యపడినది కాదు. తరువాత 'తెలుగు ఎకాడెమీ'కి మేనేజరు కావలయు నని పత్రికలలో బ్రకటింపబడియెను. కొందఱు విద్యాధికులైన మిత్రుల ప్రోత్సాహమువలన నే నాయుద్యోగమునకు దరఖాస్తుపెట్టినప్పుడు జరిగినచర్య వైపరీత్యముగా గన్పట్టకమానదు. అది యొక పెద్దచరిత్ర మగును. పరిషత్కార్యదర్శులకును తత్సభాధ్యక్షులకును చర్చ ప్రారంభమై కొంతకాలము నడచినది. అటు పిమ్మట కార్యదర్శులైన బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయశాస్త్రులవారును, మ. రా. రా. శ్రీహైకోర్టువకీలు పురాణము నాగభూషణము ఎం. ఏ. బి. ఎల్ గారును, డాక్టరు ఆచంట లక్ష్మీపతి బి. ఏ. ఎమ్.; బి. సి. యం గారు 'మేనేజరు'గా నన్ను నియమించి యంగీ