పుట:Andhrula Charitramu Part 2.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇతడు క్రీ.శ.1192-93సంవత్సరమున వ్రాయబడినట్టి చౌడూరుశాసనమును బట్టి కాంచీపురమునుండి కప్పము గైకొనినటుల దెలియుచున్నది. ఈ నల్లసిద్ధిరాజు కాంచీపురమునుండి కప్పము గైకొనిమాట సత్యమేయైనయెడల రెండవ రాజాధిరాజునకు దరువాత కాంచీపురమునబుట్టిన సంక్షోభములో నీతడు కొంత జోక్యము కలుగజేసికొని యుండవలయునని యూహింపవలసియున్నది. [1]అప్పుడు స్వల్పకాలము కాంచీపురము చోడులవశమునుండి తొలగిపోయినది. క్రీ.శ.1196వ సంవత్సరమునకు బూర్వమునగాని, పరమునగాని, త్రిభువనవీరదేవుడగు మూడవ కులోత్తుంగుడు కాంచీపురమును మరల వశముచేసికొనియుండును. ఇతడసమానములయిన గజబలంబులతోడ గాంచీపురముపై దండెత్తి అనేకములయిన వీరకృత్యములను గావించి విరోధులయిన రాజులనెల్ల జయించి కాంచీపురమునుజొచ్చి క్రోధాగ్ని చల్లారిన వెనుక గాంచీపురము మొదలుగ నుత్తరభాగమునంతట గప్పమును విదించి గైకొనియెనని చెప్పబడినది. [2] ఈ భుజబలవీర నల్లసిద్ధచోడ మహారాజునకును, ఎర్రరసిద్ధిరాజుకొడుకగు తమ్ముసిద్ధి రాజునకునెట్టి సంబంధముగలదో శాసనములంబట్టి యేమియుందెలియరాదు. తెలుగుచోడులు, పల్లవులు, నాగవంశజులు మొదలగు వారిలో నల్లసిద్ధిరాజు, మనుమసిద్ధిరాజు నను పేరులుగలవారు పెక్కండ్రు కానంబడుచుండుట చేత వీరికింగల సంబంధము దెలిసికొనుట బహుకష్టసాధ్య మనుటకు సందియము లేదు.

భుజబలవీర ఎఱ్ఱసిద్ధనదేవ చోడమహారాజు.

ఇతడు త్రిభువనచక్రవర్తి మూడవరాజరాజునకు సమకాలికుడుగ గన్పట్టుచున్నాడు. తమ్ముసిద్ధిరాజు తండ్రియగు ఎఱ్ఱసిద్ధిరాజును ఈ సిద్ధిరాజును నొక్కరుగాదని తోచుచున్నది. ఇతడును కాంచీపురాధిపతి వలన

  1. A.R.1904-05, para.19.
  2. S.I.I.Vol.III.p.218.