పుట:Andhrula Charitramu Part 2.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసనమున బేర్కొనబడినది. త్రిభువనచక్రవర్తియైన కులోత్తుంగచోడదేవుని 26వ పరిపాలన సంవత్సరమున నీ దానశాసనము వ్రాయబడినటుల జెప్పబడినందున, నీతడు మూడవ కులోత్తుంగచోడదేవునికి లోబడి పరిపాలనము సేయుచుండిన యొక మండలేశ్వరుడని తేటపడుచున్నది.

మఱియును, ఇతని శాసనములు చెంగల్పట్టు మండలములోని కాంచీపురము, తిరువోత్తీయూరు, తిరుప్పానూరు గ్రామములలోను, ఉత్తరార్కాడు మండలములోని తిరువాలంగాడు గ్రామములోను, గానంబడుచున్నవి. కాంచీపురశాసనములో నితడు గండగోపాలునికి శ్రీదేవిగర్భమున జనించిన పుత్రుడనియు, మనుమసిద్ధిరాజునకు గడగొట్టు తమ్ముడనియు, వ్రాయబడియున్నది. గండగోపాలుడనునది యెర్రసిద్ధిరాజుయొక్క నామాంతరము. తమ్ముసిద్ధిరాజుయొక్క శాసనములు ద్రావిడదేశమునందు క్రీ.శ.1204 మొదలుకొని 1208 వరకు గానంబడుచున్నవి.

భుజబలవీర నల్లసిద్ధనచోడదేవ మహారాజు.

మధురాంతకక పొత్తపిచోడ నల్లసిద్ధిరాజను నామముగల మరియొక సిద్దిరాజు త్రిభువన చక్రవర్తి మూడవకులోత్తుంగునకు సామంతుడుగనుండినటుల గూడూరు, నెల్లూరు, ఆత్మకూరు శాసనములవలన తెలియుచున్నది. ఇతనికి బేటరాజనుకుమారుడుండెను. క్రీ.శ.1218-14 సంవత్సర ప్రాంతముననున్న మధురాంతక పొత్తపి బేటరాజు పై జెప్పినతడే యై యుండవచ్చును. ఈ బేటరాజు తండ్రియగు నల్లసిద్ధిరాజు పేరు మరికొన్ని శాసనములందు గన్పట్టెడి. భుజబలవీర నల్లసిద్ధచోడదేవ మహారాజు నొక్కడేయని కొందరు తలంచుచున్నారు. ఈ భుజబలవీర నల్లసిద్ధచోడదేవ మహారాజు వల్లూరుపురము రాజధానిగ జేసికొనియెనని చెప్పబడినది. ఈ వల్లూరుపురము మార్జవాడి లేక మహారాజుపదియను ఏడువేలుగల దేశమునకు రాజధానిగనుండెను. కడపకు వాయవ్యపుమూల 8 మైళ్ళ దూరమున నున్న వల్లూరుపూర్వము గొప్ప పట్టణమై వల్లూరుపురమను పేర బరగుచుండెను.