పుట:Andhrula Charitramu Part 2.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లో గన్పడుచున్న బేటభూపాలుడును, ఒక్కడేయని నిర్ధారించుటకు బేటభూపాలుని మనుమడగు నల్లసిద్ధిరాజు క్రీ.శ.1202వ సంవత్సరమున బరిపాలనము సేయుచున్నందున తాతమనుమలకు నడిమికాలము మిక్కిలి సుదీర్ఘమైనది గనుక నిద్దరు నొక్కరేయని చెప్పుటకు గొంచెము సంశయముగలుగుచున్నది. విక్రమచోడ చక్రవర్తి కాలమున బొత్తపి నాటికి బరిపాలకుడుగ నుండిన మరియొక తెలుగుచోడుని నామము గానంబడుచున్నది. అతడు మధురాంతక పొత్తపిచోడ విమలాదిత్యుడు. ఇతనికిని పైజెప్పిన మధురాంతకపొత్తపిచోడ బేటరాజునకు నెట్టి సంబంధముగలదో విచారింపవలయును.

మధురాంతక పొత్తపి చోడ విమలాదిత్యుడు.

1125_1126

ఇతడు సిద్ధిరాజునకు గుమారుడనియు, పొత్తపినాటికి ప్రభువనియు నందలూరు శాసనములవలన దేటతెల్లమగుచున్నది. ఈ విమలాదిత్యుని తండ్రియగు సిద్ధిరాజు శాసనమొకటి నందలూరున గానంబడుచున్నది. విక్రమచోడుని విజయము కొరకు విమలాదిత్యుడు క్రీ.శ.1125_26వ సంవత్సరముననొక గ్రామమును దానముచేసెను. ఈ మధురాంతకపొత్తపి చోడవిమలాదిత్యుని కుమారుడగు సోమేశ్వరుడు నందలూరులోని సౌమ్యనాథస్వామి దేవాలయముయొక్క వెలుపలి గోపురమును నిర్మింపించెనని మరియొక శాసనము వలన దెలియుచున్నది. ఈ సిద్ధిరాజును, విమలాదిత్యుడును, సోమేశ్వరుడును నిర్వచనోత్తరరామాయణ కృతిపతియగు మనుమసిద్ధిరాజు పూర్వీకులతోడ నెట్టి సంబంధము గలవారో స్పష్టముగా బోధకాలేదు. అయినను నిర్వచనోత్తరరామాయణ కృతిపతియగు మనుమసిద్ధిరాజు తాతయగు సిద్ధిరాజు యొక్క చిన్న తమ్ముడగు తమ్ముసిద్ధిరాజుయొక్క శాసనములలోనొక

[1]

  1. Annual Report on Epigraphy, for 1937. Nos.579, 584.