పుట:Andhrula Charitramu Part 2.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావేరినది కానకట్ట కట్టించెననియు గూడ నీ క్రింది పద్యములో సూచించియున్నాడు.

“శా. చేసేతంబృథివీశులందుకొన గాశీసింధుతోయంబులన్
జేసెన్ మజ్జన, ముంగుటంబున హరించెం బల్లవోర్వీశును
ల్లాసం బొందంగ, ఫాలలోచనము, లీలంగట్టె గావేరి, హే
లాసాధ్యాఖిలదిఙ్ముఖుండు కలికాలక్ష్మావిభుండల్పుడే.“

ఇతని వంశమునందు మధురాంతక పొత్తపి చోడుడును, తెలుంగు బిజ్జనయు జనించిరి. వీరిలో మొదటివానిని తిక్కన తన నిర్వచనోత్తర రామాయణమునం బేర్కొనియుండలేదు. ఈ చోడభూమీశుడు మధురాపట్టణమును జయించుటచేతను, ఆంధ్రదేశమున బొత్తపి యను పట్టణమును నిర్మించుటచేతను, మధురాంతకపొత్తపి చోడుడని వ్యవహరింపబడియెనట. విక్రమసింహపురి చోడులలో బెక్కండ్రు మధురాంతక పొత్తపి చోడుడనుటను బిరుదనామముగా దమనామములకు ముందు జేర్చుకొని శాసనములలో వ్రాయుచుండిరి. కవిబ్రహ్మయగు తిక్కనసోమాయజి మధురాంతకపొత్తపి చోడుని బ్రశంసించకపోయినను బిజ్జనను మాత్రము,

“చ. పురుషపరాక్రముం డగుచు బల్లవువీట నుదగ్రులైనప
న్నిరువుర నాతనింగలయ నెన్ని యనర్గళమత్సరంబు మై
మురరిపు సన్నిభుండు పదుమువ్వురగం డడగంగబెట్టె దా
బిరుదు వెలుంగ బిజ్జడరిభీకర భూరిభుజాలంబునన్.“

అని యభివర్ణించియున్నాడు. ఈ బిజ్జన ఉజ్యపురియందు, శిఖరమున గరుడ విగ్రహము గలిగియుండునట్టి విజయస్తంభము నొకదానినిర్మించెనని చెప్పంబడియెను.

[1]

  1. కోయంబత్తూరు మండలములో కొల్లేగాలము అను స్థలమునకు 18మైళ్ళ దూరముననున్న ఉజ్జపురమే ఉజ్యపురమని డాక్టరు లూడర్సుగారు నిర్ధారణము చేసినారు. అయినను నెల్లూరు మండలములో సూళూరుపేట డివిజనులో ఉచ్చూరు అనెడి గ్రామమొకటి కలదు. ఇచ్చటి యరవశాసనములలో నీ గ్రామము ఉచ్చియూరని వాడబడియున్నది.