పుట:Andhrula Charitramu Part 2.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పనక్కరలేదు. వీరు దేశాభిమానము, భాషాభిమానము, దేవతాభక్తి గల వారలు. కమ్మనాటిలో పెక్క శివాలయములు నిర్మించిరి. ఈ శివాలయములకు బెక్కు భూదానములను గావించిరి. వీరు కీర్తినారాయణులనియు, టెంకణాదిత్యులనియు, జగనొబ్బగండలనియు, ఒరయూరుపురవరాధీశ్వరులనియు, బిరుదములను వహించుచు వచ్చిరి. ఈ కొట్టిదొన చోడులలో గడపటివారి చరిత్రము కాకతీయుల గూర్చిన ప్రకరణములో వివరింపబడును.

నెల్లూరు తెలుగుచోడులు.

కొంతకాలము చాళుక్యచోడచక్రవర్తులకును మరికొంత కాలము కాకతీయాంధ్ర చక్రవర్తులకును లోబడి నెల్లూరు మొదలుకొని ద్రావిడదేశమునందలి కాంచీపురము వరకును గల దేశమును బరిపాలించి మండలేశ్వరులని ప్రసిద్ధిగాంచిన విక్రమసింహపురి తెలుగుచోడులను గూర్చిన చరిత్రమును సంగ్రహముగా వివరింతును. ఇప్పటి నెల్లూరు, పూర్వమీ చోడుల పరిపాలన కాలమున విక్రమసింహపురమని పేర్కొనబడుచుండెను. ఈ తెలుగుచోడులు తాము సూర్యవంశజులనియు, కశ్యపగోత్రులనియు, కరికాలాన్వయులనియు, తమ శాసనములయందు జెప్పుకొని యుండిరని యిదివరకే చెప్పియుంటిని. ఈ చోడవంశము నభివర్ణించుచు తిక్కనసోమాయజి తన నిర్వచనోత్తర రామాయణమున పై సంగతినే ఈ క్రింది పద్యములో దెలిపియున్నాడు.


“ఉ. అంబుజనాభు నాభినుదయం బయి వేధ మరీచిగాంచె, లో
కంబులకెల్ల బూజ్యుడగుకశ్యపుడాతనికిన్ జనించె, వి
శ్వంబు వెలుంగజేయగ దివాకరుడమ్ముని కుద్భవించె, వా
నిం బొగడం జతుశ్శ్రుతులు నేరకయున్నవి నాకు శక్యమే.“


ఇంతియగాక కరికాలుడు త్రిలోచనపల్లవుని జయించె ననియు,