పుట:Andhrula Charitramu Part 2.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నికి నన్నెచోడుడు, కన్నరదేవచోడుడు, శ్రీచోడదేవుడు నను ముగ్గురుకొడుకులుగలరు.

నన్నెచోడమహారాజు.

ఈ నన్నెచోడమహారాజు తన తండ్రియైన త్రిభువనమల్లదేవ చోడమహారాజునకును, తల్లియైన మాబలమహాదేవికిని, పుణ్యముకలుగుటకొరకు అభినవరైవతకాద్రిపైనున్న కేశవస్వామి యాలయమునకు శా.శ.1070వ సంవత్సరము అనగా క్రీ.శ.1148వ సంవత్సరమున భూదానముచేసెను. క్రీ.శ.1151వ సంవత్సరమున మరల నాదేవునికి మరియొక భూదానము చేసెను. బొప్పూడిగ్రామములోని శివాలయమునకు సమీపమున నున్న స్తంభముపై నన్నెచోడునియొక్కయు, నతని యిర్వురుసోదరులయొక్కయు, నామములను దెలిపెడి శాసనము మరియొకటికలదు. ఈ శాసనము క్రీ.శ.1157వ సంవత్సరములోనిది. ఈ శాసనము శిథిలమయినదిగనున్నది. ఈ నన్నెచోడునకు అన్న మంత్రి మహాప్రధానిగనుండెనని యొకటిరెండు శాసనములవలన దెలియుచున్నది. కాబట్టి యీ నన్నెచోడుడు క్రీ.శ.1160వ సంవత్సరకాలముననున్నవాడని స్పష్టముగ తెలియుచున్నది.


సామంతమండలేశ్వరులు.

ఈ కొణిదెన చోడులలో ప్రాచీనులు చోడచక్రవర్తియగు కులోత్తుంగ రాజేంద్రచోడునకు సామంతులుగనున్నను, జాలవరకు స్వతంత్రపరిపాలనమునే చేయుచుండిరి గాని, తరువాతివారు రాను రాను స్వాతంత్ర్యమును గోల్పోయి చోడచక్రవర్తులకు ప్రతినిధులుగా నున్న మహామండలేశ్వరులయిన వెలనాటి చోడులకు లోబడి పరిపాలనము చేయవలసిన వారయిరి. కడపటివారు, కాకతీయ చక్రవర్తుల యధికారము విజృంభించిన తరువాత తమకుంగల యల్పస్వాతంత్ర్యమును గూడ గోల్పోయి కేవలము సేవకులై వారలను గొలువ వలసిన వారలైరి. ఈ సామంత చోడులు శైవమతావలంబకులుగనుండిరని వేరుగ నొక్కి