పుట:Andhrula Charitramu Part 2.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణుడై యుండవలయును. ఇతరాధారములేవియును లేక కేవలము బసవపురాణములోని వాక్యముల నమ్ముటకు సాధ్యముకాదు. ఏలయన, బండ్రెడవ శతాబ్దమధ్యమునందు జరిగిన వృత్తాంతము పదునాల్గవ శతాబ్ద ప్రారంభమున రచింపబడియుండుటచే నిందలి విషయములనేకములు సత్యములయి చరిత్రాంశములుగ నుండజాలవు. కుమారసంభవ పీఠికయందు "ఇతని గురువును కృతికర్తయునగు మల్లికార్జునఋషి ద్రవిడమండలమున శైవసమయాచార్య త్రయములో మేలిమిగన్న మాణిక్యవాచకునితో వాదించినట్లు తెలియుచున్న”దని వ్రాయబడియున్న విషయము సత్యమగునేని మాణిక్యవాచకుడు వరగుణ పాండ్యభూమండలాధిపతితో సమకాలికుడు కావున, మన నన్నెచోడుడును మల్లికార్జునయోగియు దొమ్మిదవ శతాబ్ద మధ్యముననున్నవారనియూహింపవలసివచ్చును. ఇది విశ్వసింపదగినదిగా గన్పట్టదు. అయినననేక హేతువుల చేత నితడు క్రీ.శ.1120_40 సంవత్సరముల మధ్యనున్నవాడని చెప్పవచ్చును. ఈ కుమారసంభవకావ్యమును బఠించితిమేని తప్పక యిది నన్నయభట్టారకునికి బూర్వమున రచింపబడిన కావ్యమని బోధపడగలదు. ఇతరములయిన ప్రమాణములు గాన్పించువరకు నన్నెచోడకవి నన్నయభట్టునకు నరువది డెబ్బది సంవత్సరములకు తరువాత నున్నవాడనియే నిశ్చయింతము. నన్నెచోడుడు పాశ్చాత్యచాళుక్యులతో యుద్ధముచేసి రణనిహతుడయ్యెనని పీఠికయందు వ్రాసినది నిక్కమగునేని నేను చెప్పినకాలము తప్పక సరిపోవును. ఆ కాలమునందు కమ్మనాటికి బైనున్న పల్నాడు మొదలగు వానిని పశ్చిమచాళుక్యులకు గప్పముగట్టుచు సైన్యాధిపతులుగనున్న హైహయవంశజులు పరిపాలనము సేయుచుండిరి. వారలతోడనైన యుద్ధమున నీతడు మరణమునొంది యుండవచ్చును. ఇతడు యుద్ధములో జనిపోవుటకు గారణము కృతి ముఖంబున మగణము తరువాత రగణము నిలుపుటయే యని అథర్వణాచార్యుడు తన ఛందస్సునందీ క్రిందిపద్యమున దెలిపియున్నాడు.

“మగణమ్ము గదియ రగణము
వగవక కృతి మొదట నిలుపువానికి మరణం